బయ్యారం, మే 2 : కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ఆమె మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందులను మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు రైతులు అగచాట్లు పడుతున్నారని అన్నారు. ఎన్నికల వేళ రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులుకాస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కనీసం గన్నీ బస్తాలు కూడా సరఫరా చేయకపోవడంతో రైతులే కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. 14 శాతం ఉండాల్సిన తేమ 12 శాతానికి పడిపోయినా కాంటా వేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో రైతులకు ఇబ్బందులు లేకుండా పంటను కొనుగోలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. రైతు బిడ్డనని చెప్పుకొనే మంత్రి తుమ్మల నాగేశ్వరావు కండ్లు తెరిచి అన్నదాతల కష్టాలు చూడాలని హితవు పలికారు. నెల రోజులు దాటినా జిల్లాలో పండించిన పంటలో కనీసం నాలుగో వంతు కూడా కొనలేకపోయారని, రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఈ నెల 6న వరంగల్‌లో జరిగే రైతు సదస్సుకు కదిలి రావాలని పిలుపునిచ్చారు.