హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానికసంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈనెల 25న ఇందిరాపార్ వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారాలను వినియోగించకుండా, కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నదని విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టంలేక సమస్యను పకదారి పట్టించడానికి కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్ల పెంపునకు చట్టప్రకారం, రాజ్యాంగపరంగా ఎలాంటి అవరోధాలు లేవని వెల్లడించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం దానిని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్‌పైనే ఉన్నదని, బీజేపీపై నెపం నెట్టడం మానుకోవాలని సూచించారు.