హైదరాబాద్, సెప్టెంబర్12 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ప్రధాన గేటు వద్ద శనివారం నిర్వహించ తలపెట్టిన ఓబీసీ సత్యాగ్రహ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలిరావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ దీక్షలో పాల్గొనాల్సిందిగా శ్రీనివాస్‌గౌడ్‌ను అసోసియేషన్ నేతలు గురువారం కలిసి ఆహ్వానించారు.
ఆయన సానుకూలంగా స్పందించడమేగాక దీక్షకు మద్దతు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించడంతోపాటు, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని, బీసీలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఓబీసీ నేషనల్ ఫెలోషిప్లను రూ.5 వేలకు పెంచాలని ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కూడా 3 నెలల్లో కులాలగణన చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని కోరారు.
కులగణనతోనే వెనుకబడిన కులాల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, జాతీయ కార్యదర్శి సాయికిరణ్, రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అభినేశ్, బొమ్మ ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.