మహబూబాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నెండేండ్ల పాలనలో గిరిజనాభివృద్ధి అధోగతి పాలైందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మంగళవారం ఆమె జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందుతో కలిసి మహబూబాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌లో జరిగిన బీజేపీ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పటికీ లంబాడీ, ఆదివాసీల వెనుకబాటుకు కాంగ్రెస్, బీజేపీలే కారణమని విమర్శించారు. 1956లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలపాటు కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ల అంశాన్ని నిర్లక్ష్యం చేసిందని, అనంతరం జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి 1976లో రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు. ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశామని ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ నాయకులు దీనివల్ల గిరిజనుల కడుపు నిండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
ప్రధాని మోదీ మానుకోట వచ్చిన క్రమంలో ఓ గిరిజన మహిళకు నమస్కరిస్తే తమపై ప్రేమ ఉన్నదని అనుకున్నామని, అయితే అవసరమైన సంక్షేమ పథకాలు అందించినప్పుడే గిరిజనుల కడుపు నిండుతుందని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో ఐటీడీఏలకు నిధులు కేటాయించి గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేశారని, స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన సంక్షేమానికి తీవ్రంగా శ్రమించారని కొనియాడారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు సేవాలాల్ మహరాజ్ జయంతికి కేసీఆర్ గుర్తింపునిచ్చినట్టు తెలిపారు. రూ. 50 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లో లంబాడీ, ఆదివాసీ భవన్ నిర్మించి గిరిజన ఖ్యాతి పెంచినట్టు చెప్పారు. జీవో-3ను పునరుద్ధరించాలని, ఢిల్లీలో సేవాలాల్ భవన్ నిర్మించాలని డిమాండ్ చేశారు.