హైదరాబాద్/ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ట్యాక్సీ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) కృషి చేస్తున్నదని ఆ సంస్థ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్‌లోని రెడ్కో కార్యాలయంలో శుక్రవారం ఉబర్ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్ నిర్వాహకుడు రాందాస్ ప్రకాశంతో సతీశ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఉబర్లోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచే అంశంపై చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగితే ప్రజలకు ఖర్చు తగ్గడంతోపాటు డ్రైవర్లకు ఆదాయం పెరుగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో హైదరాబాద్‌లో 150 ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలను రెడో సంస్థ ఏర్పాటు చేస్తున్నదని వివరించారు. 2030 కల్లా దేశవ్యాప్తంగా 25 వేల ఎలక్ట్రిక్ వాహనాలను నడిపించే లక్ష్యంతో ఇటీవల టాటా సంస్థతో ఉబర్ చేసుకున్న ఒప్పందం చేసుకోవడాన్ని సతీశ్‌రెడ్డి అభినందించారు. కాగా, రెడ్కో ప్రతిపాదనపై తాము ఆసక్తిగా ఉన్నామని రాందాస్ ప్రకాశం చెప్పారు.