హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): గోరంత చర్యకు..కొండంత ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ సర్కారు తీరుకు అద్దం పడుతున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. మొన్న సింగరేణి కార్మికులకు బోనస్ విషయంలో, నేడు గురుకుల విద్యార్థుల డైట్ చార్జీల పెంపులో అదే జరిగిందని ఒక ప్రకటనలో ఉదహరించారు. సింగరేణి కార్మికులకు వచ్చిన లాభాల్లో 16.9శాతం బోనస్ చెల్లిస్తే ప్రభుత్వ ప్రకటన మాత్రం 33శాతంగా ఉన్నదని, తాజాగా డైట్ చార్జీలను కేవలం 10శాతం పెంచితే, 40శాతం పెంచినట్టు ప్రచారం చేస్తున్నారని ఆయన వివరించారు. బోగస్ ప్రచారమే కాంగ్రెస్ సర్కారు విధిగా పెట్టుకున్నదని విమర్శించారు. ఏయే తరగతులకు ఎంతెంత మెస్ చార్జీలు ఉండేది? వాటిని సర్కారు ఎంత మేరకు పెంచిందో ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో కరెంట్ సరఫరాపై కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామని, రైతు సంక్షేమమే తమ ప్రాధాన్యమని కాంగ్రెస్ చెప్పినవన్నీ అసత్యాలని మండిపడ్డారు. 2018 జనవరి 1 నుంచే రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు సరఫరాను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుచేశారు. ఇప్పుడు కోతలు లేకుండా కేసీఆర్ తరహాలో 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కొనసాగిస్తేచాలని ఎక్స్ వేదికగా చురకలంటించారు.