హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): వ్యవసాయశాఖలో ఒకే చోట ఏండ్లుగా పాతుకుపొయిన ఉద్యోగులు ఈ బదిలీల్లో సైతం తమ స్థానాన్ని ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఏ విధంగా అయినా సరే బదిలీని ఆపించేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఇందుకోసం పలుకుబడితో పైరవీలు సాగిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా రాజకీయ నేతల నుంచి సిఫార్సు లేఖలతో వ్యవసాయశాఖ కమిషనరేట్ చుట్టూ తిరుగుతున్నారు. బదిలీని అపేందుకు ఉన్నతాధికారులపై రాజకీయంగా ఒత్తిడి చేయిస్తున్నట్టు తెలిసింది. ఈ బదిలీలేంటోగానీ పైరవీలు, ఫోన్లు, ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నామంటూ పలువురు అధికారులు వాపోతున్నారు.
వ్యవసాయశాఖలో వందల సంఖ్యలో ఉద్యోగులు ఒకే చోట పది, పదిహేనేండ్లుగా విధులు నిర్వరిస్తున్నారు. అంతకుముందు వాళ్లకు బదిలీ అయినప్పటికీ తమ పలుకుబడి, పైరవీలతో మళ్లీ అదే స్థానంలో తిష్టవేశారు. ఇప్పుడు మళ్లీ బదిలీల ప్రక్రియ జరుగుతుండటంతో ఏండ్లుగా తిష్టవేసిన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్టు తెలిసింది. బదిలీల్లో దూరం వెళ్లాల్సి వస్తుందేమోననే భయంతో బదిలీని ఆపించేందుకు స్థాయికి మించి పైరవీలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ డైరెక్టరేట్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
బదిలీల పూర్తికి రెండు రోజుల గడువే ఉండటంతో ఉద్యోగులు తమ పైరవీలకు మరింత పదును పెట్టినట్టు తెలిసింది. ఒకవేళ బదిలీ చేయడం తప్పనిసరైతే.. జిల్లాలకు కాకుండా ఉమ్మడి హైదారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలంటూ కోరుతున్నట్టు సమాచారం. అయితే బదిలీల్లో ఉన్నతాధికారులు పైరవీలకు తావు ఇవ్వటం లేదని తెలిసింది. ఎవరైనా సరే బదిలీ జాబితాలో ఉంటే కచ్చితంగా వెళ్లాల్సిందేనని తేల్చి చెప్తున్నట్టు సమాచారం.