హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు సర్పంచ్ల సంఘం జేఏసీ విజ్ఞప్తి చేసింది. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తక్షణమే బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇటీవల ఫిర్యాదు చేసింది. దీంతో ఈ నెల 6న పంచాయతీరాజ్ కమిషనర్ హాజరుకావాలంటూ మానవ హకుల కమిషన్ నోటీసు జారీ చేసింది. కానీ, కమిషనర్ హాజరు కాకుండా నాలుగు వారాల గడువు కోరారు. అయితే కమిషనర్ వస్తారనుకొని తాము బుధవారం మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి వచ్చినట్టు సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ తదితరులు తెలిపారు.