రఘునాథపల్లి/ లింగాలఘనపురం, డిసెంబర్ 24 : జనగామ జిల్లా లింగాలఘనపురంలో ఎమ్మెల్యే కడియం సాక్షిగా సర్పంచ్‌కు అవమానం జరిగింది. బుధవారం తహసీల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని 21 మంది సర్పంచ్‌లను ఆహ్వానించారు. లింగాలఘనపురంలో నిర్వాహకులు వేదికపైకి మొదట ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆర్డీవో గోపీరాం, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శివశంకర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, ఏఎంసీ డైరెక్టర్లు నీలం మోహన్, శ్రీలతారెడ్డిని ఆహ్వానించారు. లింగాలఘనపురంలో బీఆర్ఎస్ తరఫున సర్పంచ్‌గా గెలిచిన ఎడ్ల లావణ్యరాజును మాత్రం ఆహ్వానించలేదు.
బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్ధిగా ఎడ్ల లావణ్యరాజు, కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా ఏఎంసీ డైరెక్టర్ శ్రీలతారెడ్డి తలపడగా శ్రీలతారెడ్డి ఓడిపోయింది. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక సర్పంచ్ ఎడ్ల లావణ్యరాజును పిలువకపోవడంతో గ్రామస్తులు భగ్గుమన్నారు. తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శివశంకర్‌రెడ్డి, అధికారులను బీఆర్ఎస్ సర్పంచ్‌లు, గ్రామస్తులు నిలదీయడంతో వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో కల్యాణిలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీకి వస్తున్న కడియం శ్రీహరికి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతున్నట్టు గా బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకొని మండల పరిషత్ కార్యాలయం ఎ దుట నిరసనకు దిగారు. కడియం శ్రీహరి రాజీనామా చేయాలి, లేదంటే బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని డిమాండ్ చేశారు.