హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారం చేపట్టినప్పటి నుంచి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది. కాంగ్రెస్ గద్దెనెక్కగానే ఆ పార్టీ నేతలు పచ్చని పాలమూరు (Palamuru) జిల్లాలో బీఆర్ఎస్ (BRS) నేతల రక్తం కండ్ల చూశారు. వరుసగా హత్యలు చేయిస్తూ.. ప్రజలను, ప్రతిపక్ష పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ హత్యా రాజకీయాలను పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. కేసుల దర్యాప్తును సైతం పోలీసులు పట్టించుకోవంలేదు. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలతో తరచుగా రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవల మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు ముందే.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు విచక్షణారహితంగా దాడిచేశారు. కత్తులు, కర్రలతో 15 మందిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో బీఆర్ఎస్ నాయకుడు ఉప్పుల మల్లయ్య దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు అక్కడే ఉన్నా.. చోద్యం చూశారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. గ్రామ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన మాదాసు చినవెంకన్నను గ్రామప్రజలు సర్పంచ్‌గా గెలిపించి, కాంగ్రెస్ హత్యారాజకీయాలకు చెంపపెట్టులాంటి సమాధానం చెప్పారని గులాబీ శ్రేణులు తెలిపాయి.
కాంగ్రెస్ దౌర్జన్యకాండకు కొందరు పోలీసులు అండగా ఉన్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ గూండాలతో కలిసి ఇష్టారీతిన రెచ్చిపోతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అండతోనే కాంగ్రెస్ గూండాలు హత్యలకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉంటే ట్రాక్టర్లతో తొక్కి స్తూ, వేటకొడవళ్లతో దాడులకు ప్రయత్నించడం మారిందని చెప్తున్నారు. కాంగ్రెస్ ఓడిపోయిన చోట్ల బీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడటం, పోలీసులు మద్దతు తెలుపడం ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చ అని వివరిస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని డీజీపీ శివధర్‌రెడ్డి ఆదేశాలను క్షేత్రస్థాయి సిబ్బంది గాలికి వదిలేశారని వాపోతున్నారు.
‘మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. నన్ను ఎవడ్రా అడ్డుకునేది. నన్నేం చేస్తార్రా మీరు? నా వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్‌పేట్‌కు చెందిన మండలాధ్యక్షుడి బాబాయి, నూతన సర్పంచ్ పాపాయ్య.. బీఆర్ఎస్ అభ్యర్థి బిట్ల బాలరాజు, అతని అనుచరులపై ట్రాక్టర్ ఎక్కించాడు. సర్పంచ్ ఎన్నికల్లో పాపయ్య గెలిచిన తర్వాత కూడా బాలరాజుపై ట్రాక్టర్ ఎక్కించి మరీ అక్కసు వెళ్లగక్కాడు. పాపయ్యకు వ్యతిరేకంగా పోటీ చేసినందుకు బాలరాజు, అతని అనుచరులు, కుటుంబసభ్యులు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు పాపయ్య… తనకు కాంగ్రెస్, అధికారుల అండ ఉన్నదని ప్రకటిస్తూ హత్యకు యత్నించాడు. ఇక కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇటిక్యాల పహాడ్‌లో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి భీంరావు… గెలుపొందిన తానుబాయి భర్త పోశెట్టిపై వేట కొడవలితో దాడికి యత్నించాడు.
కాంగ్రెస్ వైఫల్యాల గురించి ప్రశ్నించే.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారని గులాబీ పార్టీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టులు చేసి, భయపెట్టి కాంగ్రెస్ వాళ్లకు అప్పగిస్తున్నారని వివరిస్తున్నారు. మొదటి విడత ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చింతలపాలెం, మఠంపల్లి, గరిడపల్లి, హుజూర్నగర్ ఎస్ఐలు కాంగ్రెస్‌కు తొత్తులుగా వ్యవహరించారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించకపోతే, భవిష్యత్తులో ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా కాపాడలేరని హెచ్చరించారు.