గద్వాల/గట్టు/గద్వాల అర్బన్, ఆగస్టు 17: గద్వాల నియోజకవర్గంలోని కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమన్నది. శనివారం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జూరాల, నెట్టెంపాడ్, ర్యాలంపాడ్, గట్టు ఎత్తిపోతల పనులను పరిశీలించడానికి ప్రభుత్వ సలహాదారుడు ఆదిత్యనాథ్‌తో కలిసి ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయమై స్థానిక కాంగ్రెస్ నాయకురాలు సరితకు సమాచారం లేకపోవడంతో.. ఆమె వర్గీయులు ఈదమ్మ గుడి, చింతలపేట కాలనీ సమీపంలో రోడ్డుపైకి వచ్చి మంత్రి కారును అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను వెళ్లగొట్టడానికి ప్రయత్నించినా వినలేదు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకొని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వగా మంత్రి కాన్వాయ్‌పై పడ్డాయి. కాన్వాయ్ దిగిన కృష్ణమోహన్‌రెడ్డి తన ఇంటికి వెళ్లిపోయారు. చేసేది లేక మంత్రి ఒక్కరే సరిత ఇంటికి చేరుకోవడంతో ఆందోళన సద్దుమణిగింది.
ఎమ్మెల్యే పార్టీలో చేరడానికి తాము వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ కండువా కప్పుకొని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని సీఎం వద్దకు తీసుకెళ్తానని మంత్రి హామీ ఇవ్వడంతో మంత్రితో కలిసి సరిత ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లారు. జూపల్లితో సమావేశమైన అనంతరం సరిత కార్యకర్తలతో మాట్లాడారు. ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్యాయం చేయరన్న నమ్మకం తనకు ఉన్నదని చెప్పారు. ‘మనకు ఓట్లు వేసిన వాళ్లకు అన్యాయం జరగొద్దని నోరు మూసుకొని కూర్చున్నా.. ఈ మౌనం మీకు అన్యాయం జరగనంత వరకే ఉంటుంది.
ఒకవేళ మీకు అన్యాయం జరిగితే నేను నోరు విప్పుతా. ఎమ్మెల్యే పార్టీలో చేరడాన్ని మనం వ్యతిరేకించొద్దు అంటూ సరిత కార్యకర్తలకు సూచించారు. మంత్రి కాన్వాయ్‌ను ఎమ్మెల్యే బండ్ల, జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వాహనాలు అనుసరించాయి. ఎమ్మెల్యే కాన్వాయ్‌లోని ఓ వాహనం వెనుక సరిత అనుచరుల వెహికిల్ ఉండగా.. ఓవర్టేక్ చేసేందుకు దారి ఇవ్వలేదని ఒకరు ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డగించాడు. కారుపై దాడి చేయగా.. వాహనం అద్దం ధ్వంసమైంది. గద్వాల లోని క్యాంప్ కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మీడయాతో మాట్లాడుతూ.. కొందరు రౌడీమూకలు మంత్రి పర్యటనను అడ్డుకోవడం బాధాకరమని విమర్శించారు. గద్వాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుండగా కొందరు స్వార్థ రాజకీయం కోసం ఆటంకాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.