సూర్యాపేట : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్(Sardar Sarvai Papanna) తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీకని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్ లో సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 313వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాలను కలుపుకొని అప్పటి నియంతృత్వ, నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పాపన్న పోరాడారని గుర్తు చేశారు. పాపన్న జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని వెల్లడించారు. సర్వాయి పాపన్న యావత్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. పాపన్న గౌడ్ వర్ధంతి ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ బడుగు, బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని అన్నారు.
అనంతరం పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహిస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీసీ , బహుజన సంఘాల ప్రతినిధులు మంత్రి జగదీశ్ రెడ్డి ని సత్కరించారు.వారం, పదిరోజుల వ్యవధి లో నే రెండు కోట్ల రూపాయల తో గౌడ భవన్ నిర్మాణాని కి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎకరం నుండి రెండు ఎకరాల వరకు స్థల సేకరణ చేయాలని కలెక్టర్‌కు సూచించారు.కార్యక్రమం లో కలెక్టర్ వెంకట్రావ్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వీ , తదితరులు పాల్గొన్నారు.