జయశంకర్ భూపాలపల్లి, మే 21 (నమస్తే తెలంగాణ)/మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతీ నది ఉద్భవించిన చోట గురువారం ఉదయం 5: 43 గంటలకు సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీనదికి పూజలుచేసి పుష్క ర వేడుకలకు అంకురార్పణ చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ , మంత్రి కొండా సురేఖ , ధార్మిక సలహాదారు గోవిందహరి, కలెక్టర్ రాహుల్‌శర్మ పుష్కర స్నానమాచరించారు. సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు కాళేశ్వరం చేరుకోగా మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు సరస్వతీనదిలో పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని గవర్నర్ ప్రారంభించారు. త్రివేణి సంగమం వద్ద కాశీపండితులతో నిర్వహించిన నదీహారతి, తెప్పోత్సవాన్ని తిలకించారు. జూన్ 1తో అంత్య పుష్కరాలు ముగియనున్నాయి.
పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం..తొలిరోజే కూలిన స్వాగత తోరణం
కాళేశ్వరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న సరస్వతీ అంత్య పుషరాల ఏర్పాట్ల లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణం తొలిరోజే చిన్నపాటి గాలికి విరిగిపడటం చర్చనీయాంశంగా మారింది. ఏర్పాట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ, పనుల్లో నాణ్యత పూర్తిగా దెబ్బతిన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘాట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు గాలికి వంగిపోతూ ప్రమాదకరంగా కనిపించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు మేలొని ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాలను వెంటనే తొలగించి, భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.