రామగిరి జనవరి 31 : తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా వ్యాపారం కుదేలైపోవడంతో ఓ బిల్డర్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే తెలంగాణలో జీవనపోరాటం ఎంత దుర్భరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే క్రమంలో కరీంనగర్లో ఓ సింగరేణి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి పెద్దపల్లి జిల్లా ఆర్జీ-3 డివిజన్‌కు బదిలీ అయిన కార్మికుడు సంతోష్ ఉరివేసుకుని చనిపోయాడు. సీనియారిటీ ప్రకారం పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు వేధింపులకు గురి చేయడంతోనే సంతోష్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తోటి ఉద్యోగులు చెప్తున్నారు.
జనవరి 21న ఓసీపీ -2 మైన్‌కు పోస్టింగ్ కోసం సంతోష్ దరఖాస్తు పెట్టుకునేందుకు జీఎం కార్యాలయంలో అధికారులను కోరాడు. కానీ ఈ నెల 17న పోస్టింగ్ సిద్ధమైందని సదరు అధికారి స్పష్టంచేశాడు. మణుగూరు నుంచి 21న రిలీవ్ అయితే, ఆర్జీ-3లో 17న పోస్టింగ్ ఎలా సిద్ధమవుతుందని సంతోష్ ప్రశ్నించాడు. ఆరోజు నుంచి శుక్రవారం వరకు పోస్టింగ్ కోసం ప్రయత్నించి, అధికారి తప్పిదం వల్ల పోస్టింగ్ రావడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని కార్మిక సంఘం నేతలు చెప్తున్నారు. సింగరేణి అధికారులు తమ అవినీతితో కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు.