Srisailam | శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దంపట్టే సంక్రాంతి కనుమ పండుగకు బసవన్నకు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవంలో స్వామిఅమ్మవార్లకు నాలుగో రోజు నందివాహన సేవ, ఐదో రోజు రావణ వాహన సేవలు జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు చెప్పారు. అదేవిధంగా భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో ముగ్గులకు గల ప్రాధాన్యతను వివరించారు.
సంక్రాంతి పర్వదినాన ఆలయ దక్షిణమాడవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో స్థానిక మహిళలతోపాటు భక్తులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చెంచుల ఆరాధ్య దైవమైన ఆదిదంపతులకు వైభవంగా బ్రహ్మొత్సవ కళ్యాణం జరిపించారు. బుధవారం ఉదయం కనుమ పండుగ పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని గోకులంలో శాస్త్రోక్తంగా గోపూజలుచేశారు. ఈవో శ్రీనివాసరావుచే అర్చక వేదపండితులు గోవులకు ప్రత్యేక పూజలు చేయించారు. అదే విధంగా గోశాలలోని శ్రీకృష్ణుని విగ్రహానికి షోడశోపచారపూజాక్రతువులు నిర్వహించడంతోపాటు వృషభాలకు కూడా విశేష పూజలు నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు.
గిరిపుత్రుల ఆరాధ్య దైవమైన ఆదిదంపతులకు గిరిజన సాంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామిఅమ్మవార్ల కళ్యాణాన్ని సంక్రాంతి పండుగ రోజు రాత్రి నిత్యకళ్యాణ మండపంలో వైభవంగా చేశారు. క్షేత్ర పరిసర ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాలకు సంభందించిన గిరిజన తండా ల్లోని చెంచు భక్తులు కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నట్లు ఆలయ స్థానాచార్యులు తెలిపారు. చెంచు సాంప్రదాయం ప్రకారం స్వామి అమ్మవార్లకు వెదురుబియ్యం, పుట్టతేనె, ఆభరణాలు సమర్పించిన అడవి పుత్రులకు వేదాశీర్వచనాలు చేశారు. అదే విధంగా దేవస్థానం తరపున మగవారికి పంచ కండువా, ఆడవారికి రవిక చీరలను అందించినట్లు ఈవో తెలిపారు.
సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి మండపంలో రావణవాహనంపైవేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించిన అనంతరం డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, కళాకారుల సాంప్రదాయ నృత్యాల నడుమ క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో ఈవో శ్రీనివాసరావు, పీఆర్వో శ్రీనివాసరావు, సూపరింటెడెంట్ హర్యానాయక్, మధుసూదన్ రెడ్డి, అయ్యన్న, రెవెన్యూ అధికారులు, సంపాదకుడు అనిల్ కుమార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Srisailam | కనుమ పర్వదినాన కన్నుల పండువగా గోపూజ మహోత్సవం
TG Highcourt | తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు..!