Srisailam | శ్రీశైలం : కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానంలో గోపూజ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణములోని శ్రీ గోకులంలోనూ, దేవస్థానం గో సంరక్షణశాలలోనూ ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నిత్యం ఆలయంలో ప్రాతఃకాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహించబడుతున్నప్పటికీ, కనుమ పండుగ సందర్భంగా ఈ రోజు నిత్య గోసేవతో పాటు విశేషంగా గోపూజ జరిపించారు. ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
ఈ విశేష కార్యక్రమములో ముందుగా ఆలయములోని శ్రీగోకులం వద్ద లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు, వేదపండితులు పూజాసంకల్పాన్ని పఠించారు. ఆ తరువాత పూజాదికాలు నిర్విఘ్నంగా జరిగేందుకుగాను ముందుగా మహాగణపతి పూజ జరిపించారు. అనంతరం శ్రీసూక్తంతోనూ, గోఅష్టోత్తరమంత్రంతోనూ, గోవులకు షోడశ ఉపచారాలతో పూజాదికాలు జరిపించారు. గోవులకు, గోవత్సాలకు (ఆవుదూడలకు) నూతన వస్త్రాలు సమర్పించారు. చివరగా గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించబడ్డాయి.
ఆ తరువాత దేవస్థానం గో సంరక్షణశాలలోని శ్రీకృష్ణుని విగ్రహానికి పూజాదికాలను జరిపించారు. తరువాత గోవులకు సంప్రదాయ బద్దంగా పూజాదికాలు జరిపి నూతన వస్త్రాలను సమర్పించారు. అదేవిధంగా ఈ విశేష కార్యక్రమములో వృషభాలకు కూడా సంప్రదాయబద్ధంగా పూజాదికాలతో గ్రాసం అందజేశారు.
ఇవి కూడా చదవండి..
Khammam | ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
Crime news | మరో మూడు రోజుల్లో పెళ్లి.. కూతురును కాల్చిచంపిన తండ్రి