వికారాబాద్, మార్చి 26 : సారూ.. జ్వరం వచ్చింది… డబ్బులు ఇస్తే దవాఖానకు పోతా అంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఆవేదన వ్యక్తంచేశాడు. వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లికి చెందిన సీహెచ్ రాములు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. నెలకు రూ.9500తో కుటుంబాన్ని పోషించుకునేవాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు నెలలుగా కార్మికులకు జీతాలు రావడంలేదు. బుధవారం రాములుకు జ్వరం రావడంతో దవాఖానకు వెళ్లాలని, డబ్బుల కోసం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నాడు. అధికారులు వచ్చి డబ్బులు ఇస్తే దవాఖానకు పోయి చూపించుకోవాలని ఆశతో వచ్చాడు. పంచాయతీ కార్యదర్శి వచ్చి త్వరలో జీతాలు వస్తాయని చెప్పడంతో, ఆరు నెలలుగా జీతాలు రావడం లేదంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ప్రభుత్వం స్పందించి జీతాలు వేయాలని వాపోయాడు.