Sangareddy | సంగారెడ్డి జిల్లాలో పోలీసు సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన టీఏ బిల్లులు (Travelling Allowances), సరెండర్ లీవ్ బకాయిలు చాలా కాలంగా విడుదల కాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలో పోలీస్ విభాగానికి సంబంధించి రూ.11.34 కోట్లు టీఏ బిల్లులు, రూ.24 కోట్లు సరెండర్ లీవ్ అమౌంట్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఒక్కొక్క పోలీస్ సిబ్బందికి సగటున రూ.94,500 చొప్పున బకాయిలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇంధన భత్యాలు, యూనిఫామ్ అలవెన్సులు, హెచ్ఆర్ఏ చెల్లింపులు కూడా ఆలస్యమవుతున్నాయని చెబుతున్నారు. దీంతో సంగారెడ్డి జిల్లా పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బకాయిల చెల్లింపులపై ఉన్నతాధికారులు, జిల్లా కార్యాలయానికి పోలీసులు ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా పండుగ వేళ కూడా ఈ బకాయిల చెల్లింపులు జరగకపోవడంతో కుటుంబ ఖర్చులు వెల్లదీయడం కూడా కష్టంగా మారిందని పోలీసులు ఆవేదన చెందుతున్నారు.