సంగారెడ్డి, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/పటాన్చెరు రూరల్ : కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం శనివారం తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలుచేశారు. అప్పటి పరిస్థితుల వల్ల తప్పటడుగులు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరినా నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకు, తనకు వెంట్రుక మందం లాభం జరగలేదని స్పష్టంచేశారు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటున్నామని చెప్పారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను మూడుమార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించినట్టు తెలిపారు. కన్నతల్లిలాంటి బీఆర్ఎస్ను మరువకుండా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలు, అనుచరులకు పిలుపునిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఐదు మున్సిపాలిటీల్లో 104 కౌన్సిలర్ స్థానాలు ఉన్నట్టు చెప్పారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల కోసం ట్రేడ్ యూనియన్, కుల సంఘాలు,పెద్దమనుషుల వింగ్‌లను ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.
సంచలనం రేపుతున్న గూడెం వ్యాఖ్యలు
కాంగ్రెస్‌లో చేరి తప్పుచేశానంటూ గూడెం మహిపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున మూడుమార్లు ఎమ్మెల్యేగా గూడెం గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్‌రెడ్డి సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. అప్పటినుంచి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టులో కేసు వేసింది. పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి గూడెం మహిపాల్‌రెడ్డి తాను పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
అలాగే అసెంబ్లీ స్పీకర్ వద్ద జరిగిన విచారణ సందర్భంగా కూడా తాను పార్టీ మారలేదని స్పష్టంచేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తాజాగా సుప్రీంకోర్టు స్పీకర్‌కు సూచించింది. సుప్రీంకోర్టు రెండు వారాల గడువు విధించిన నేపథ్యంలో గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి తప్పుచేశాననడం జిల్లా, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. మహిపాల్‌రెడ్డి తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పటాన్చెరు నియోజక వర్గంలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన కాంగ్రెస్ కౌన్సిలర్ల టికెట్లు మహిపాల్‌రెడ్డికి అప్పగించటంలేదనే కోపంతో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే గూడెం వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.