ఖమ్మం, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితుల అభ్యున్నతికి దళితబంధు అమలు చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొనియాడారు. ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి బుధవారం ఖమ్మంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో దళితులను ఉప ముఖ్యమంత్రిని చేసింది కేసీఆర్ మాత్రమేనని, దళితులతో ఆయనకున్న అనుబంధాన్ని, ఆత్మీయతను ఎవరూ చెరిపివేయలేరని స్పష్టం చేశారు. కేసీఆర్ ఇంటిపై అల్లరిమూకలు కాంగ్రెస్ ముసుగులో దాడికి దిగడాన్ని తెలంగాణ సమాజం క్షమించదని చెప్పారు. దళితుల అభ్యున్నతికి దళితబంధు పేరుతో రూ.10 లక్షలు కేటాయించి వారిని వ్యాపారవేత్తలుగా మార్చి, ఆత్మగౌరవాన్ని పెంపొందించింది కేసీఆర్ హయాంలోనేనని గుర్తుచేశారు.
తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టింది, సచివాలయం వద్ద 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని తెలిపారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తదితరులు కేసీఆర్ నివాసాన్ని ముట్టడించడానికి వెళితే కాంగ్రెస్ పార్టీ ఎలా సమర్థిస్తుందని మండిపడ్డారు. దళితులు అడుగిడిన ప్రాంతంలో శుద్ధి చేశారని కాంగ్రెస్ గోబెల్ ప్రచారం చేస్తున్నదని, దాడికి వెళ్లిన నర్సారెడ్డి దళితుడా అని ప్రశ్నించారు. వెయ్యి రోజుల విఫల పాలనను విపక్ష సభ్యులు సభలో ఎండగడుతారన్న భయంతోనే ప్రభుత్వం ఎదురుదాడి చేస్తున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనావైఫల్యంపై ఈ నెల 2 నుంచి వారం రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీయడంపై ప్రజల్లో అపూర్వ మద్దతు లభించిన నేపథ్యంలో కాంగ్రెస్‌కు భయం పట్టుకున్నదని తెలిపారు. సభలో ప్రతిపక్ష సభ్యులకు సమాధానం చెప్పే ధైర్యంలేక ఎదురుదాడి చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజా సమస్యలు, హామీలపై బీఆర్ఎస్ నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సభలో సమాధానం చెప్పలేకనే గౌరవ శాసనసభను కాంగ్రెస్ ప్రభుత్వం కౌరవసభగా మార్చిందని విమర్శించారు. శాసనభలో ప్రజా సమస్యలతోపాటు రుణమాఫీ, ఫీజు బకాయిలు, ఉపకార వేతనాలు, సీతారామ ప్రాజెక్టు వంటి అనేక అంశాలపై చర్చ జరుగుతుందని రాష్ట్ర ప్రజలు భావించారని పేర్కొన్నారు.
‘తెలంగాణ సారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరడం, డప్పులతో ఆయన ఇంటి ముట్టడికి పిలుపునివ్వడమే కాంగ్రెస్ సంస్కృతా?’ అని సండ్ర, లింగాల ప్రశ్నించారు. వందలమంది గూండాలు కేసీఆర్ ఇంటికి వెళ్తే హోంశాఖను పర్యవేక్షిస్తున్న రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘దాడి చేసేందుకు వెళ్లిన ప్రభుత్వ విప్, ఆందోళనకారులకు ఎసార్ట్ ఇచ్చి పంపడం వెనుక ప్రభుత్వ కుట్ర లేదా?’ అని నిలదీశారు.
‘ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ చావును కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ కోరడం తగునా?’ అని ప్రశ్నించారు. సభ్యత, మానవత్వం లేని ఇలాంటి ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకొని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ వంటి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులను అసభ్యంగా దూషించినా ఎథిక్స్ కమిటీకి కనపడదా ప్రశ్నించారు. బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపట్ల ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అమర్యాదగా వ్యవహరించడం, పైగా ప్రతిపక్ష సభ్యులపైనే తప్పుడు కేసులు పెట్టించడం వంటి చర్యలను తెలంగాణ సమాజం గమనిస్తున్నదని చెప్పారు. సభలోకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకునే హకు పోలీసులకు లేదంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలే ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు.
జిల్లాలో సీతారామ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 90 శాతం పూర్తిచేస్తే.. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.80 కోట్లు ఖర్చు చేసి వారి ఘనత అంటూ సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఈ దగా పాలనపై ప్రజాక్షేత్రంలో మరింత ఉధృతంగా పోరాడుతామని స్పష్టం చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి మాట్లాడుతూ.. తెలంగాణ దేవుడైన కేసీఆర్‌కు ప్రాణహాని తలపెట్టడం నీచమైన చర్య అంటూ కంటతడి పెట్టారు. అనంతరం ప్రజాకవి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి నివాళులర్పించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, బెల్లం వేణు, బిచ్చాల తిరుమలరావు పాల్గొన్నారు
శాసనసభ, స్పీకర్‌పై బీఆర్ఎస్కు అపార గౌరవం ఉన్నదని సండ్ర, లింగాల పేర్కొన్నారు. సభ ప్రారంభం రోజున వివిధ రూపాల్లో నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని చెప్పారు. ‘నలుపురంగు టీషర్టు ధరించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంట్‌కు వెళ్లి నిరసన తెలుపవచ్చుగానీ తెలంగాణలో బీఆర్ఎస్ సభ్యులు తెలుపకూడదా?’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తి చేసినప్పటికీ కక్షపూరితంగా ఈ సెషన్‌కు సస్పెండ్ చేశారని మండిపడ్డారు. హామీలు, కేసులపై నిలదీస్తారన్న భయంతోనే ఇతర సభ్యులను సస్పెండ్ చేశారని ఆరోపించారు.