మాగనూరు, జూలై 8 : నారాయణపేట జిల్లా మాగనూరు మండలం పెద్ద వాగు నుంచి ఇసుక రవాణా ప్రారంభమైంది. కాచ్వార్ సమీపంలోని రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇసుక తరలించేందుకు సిద్ధమవగా.. వారం రోజులుగా స్థానికు లు అడ్డుపడుతూ వచ్చారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు కంపెనీవారికి వత్తా సు పలకడంతో మంగళవారం ఇసుకను టిప్పర్లలో తరలించి రాఘవ కన్స్ట్రక్షన్స్ తన పంతం నెగ్గించుకున్నది. ఉదయం జేసీబీలు, ఆరు టిప్పర్లు పెద్ద వాగులోకి వెళ్లాయన్న విషయం తెలుసుకొన్న గ్రా మస్థులు వాగు వద్దకు వెళ్లగా ఎస్సై అశోక్బాబు వారిని నిలువరించారు. దీంతో రాఘవ కంపెనీ సిబ్బంది, పోలీస్, రెవె న్యూ అధికారులు, గ్రామస్థుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విషయాన్ని మంత్రి శ్రీహరి దృష్టికి తీసుకెళ్తామని, అప్పటి వరకు ఇసుక తరలించొద్దని గ్రామస్థులు సూచించినా వినిపించుకోకుండా అధికారులు టిప్పర్లను వాగులోకి పంపించారు. స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బందోబస్తు మధ్య ఇసుక తరలిస్తామని తహసీల్దార్ నాగలక్ష్మి, ఎస్సై అశోక్బాబు తేల్చి చెప్పడంతో గ్రామస్థులు వెనుదిరిగారు.