Sand | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ మార్కెట్కు వెళ్తే ధాన్యం, కూరగాయలు మాత్రమే కొనుక్కునే అవకాసం ఉండేది. ఇకపై కూరగాయలతోపాటు గుప్పెడు ఇసుక కూడా ఉచితంగా తెచ్చుకునే అవకాశం కలగనున్నది. విషయం వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇదే నిజం కాబోతున్నది. అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఇసుక అమ్మాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార శనివారం ఆదేశాలు జారీచేశారు. ప్రజలకు అందుబాటులోకి ఇసుకను తెచ్చే నెపంతో తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ మార్కెట్లు ధాన్యం నిల్వలతో, కూరగాయలు, పండ్లు వంటి లావాదేవీలతో, వందలాది ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, లారీల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. ఇలాంటి మారెట్లలో డంపర్ల ద్వారా ఇసుకను తెచ్చి కుప్పలుగా పోస్తే తమకు తీవ్రనష్టం తప్పదని రైతులు వాపోతున్నారు.
ఇప్పటికే కొన్ని సీజన్లలో మారెట్లలో వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుందని, వేలాది మంది రైతులతో నిండిపోతాయని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో పెద్దపెద్ద డంపర్లతో ఇసుకను తరలిస్తే ప్రమాదాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు వాహనాల నుంచి రాలిపోయే ఇసుక ధాన్యంలో కలిసిపోతుందని, కూరగాయలపై దుమ్ము పేరుకుపోతుందని చెప్తున్నారు. తద్వారా వినియోగదారులకు ఇసుకతో కూడిన కూరగాయలు చేరుతాయన్నారు. కొన్ని రకాల కూరగాయలను ఎంత కడిగినా ఇసుక పోదని వివరిస్తున్నారు. ఇది రైతులకు, ప్రజలకు తీవ్రనష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అంతేకాకుండా ఇసుకను మోసుకొచ్చే డంపర్లు, కొనుగోలుదారుల లారీలు, ట్రాక్టర్లు తదితర వాహనాల రాకపోకలతో రద్దీ పెరుగుతుందని, మారెట్లలో మౌలిక వసతులు దెబ్బతింటాయని వివరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయంపై పునరాలోచించాలని ప్రతిపక్ష, ప్రజాసంఘాలనేతలు డిమాండ్ చేస్తున్నారు.
కూరగాయల మార్కెట్లలో ఇసుక యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రోజుకొక తెలివి తకువ నిర్ణయం తీసుకుంటూ తమకు పాలన చేతకావడంలేదని చెప్పుకుంటున్నది. ముఖ్యంగా మైనింగ్ విభాగంపై పట్టు కోల్పోయినట్టు స్పష్టమవుతున్నది. ప్రభుత్వం పర్యావరణ నిబంధనలను తుంగలో తొకుతూ ఇసుక లోడింగ్ సమయాన్ని రాత్రి 9 గంటలకు పొడిగించింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వేలాది మంది సాధారణ లారీ ఓనర్లు, డ్రైవర్ల నోట్లో మట్టి కొట్టింది. ఇప్పుడు మారెట్ యార్డుల్లో ఇసుక అమ్మకాలంటూ మరో తెలివి తకువ నిర్ణయం తీసుకున్నది. కూరగాయల మార్కెట్లలో రైతులు, అమ్మకందారులు, కొనుగోలుదారులతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇలాంటి చోట్ల వందలాది ఇసుక లారీలు వచ్చి వెళ్తే ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినట్టే.
– మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ నేత