మక్తల్, జనవరి 7 : ఇసుకను కొందరు అక్రమంగా తరలిస్తూ కృష్ణానదికి గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు. అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా రవాణా సాగిస్తున్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు నదిలో ఇసుకను తోడి డంప్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గురజాల్ సిద్ధి లింగేశ్వర మఠం వెనుక భారీగా డంపు చేసిన ఇసుకే ఇందుకు నిదర్శనం. అనుమతులు లేకుండానే రాత్రింబవళ్లు వందలాది టిప్పర్లతో ఇసుకను డంప్ చేస్తున్నారు. వారం రోజులుగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదు. దీంతో రైతులకు మేలు చేసేందుకు ఏకంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి రంగంలోకి దిగారు.
బుధవారం మధ్యాహ్నం గురజాల్ శివారులో కాంగ్రెస్ నాయకులు, వ్యాపారులు అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంప్తోపాటు నదిలో ఇసుక తరలిస్తున్న ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కృష్ణ తహసీల్దార్ శ్రీనివాసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఇసుక డంప్‌ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కృష్ణానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇసుక తీస్తే నది పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కేవలం ఇందిరమ్మ ఇండ్లకు మాత్రమే ఇసుకను కేటాయించాలని సూచించారు. కలెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు.