హనుమకొండ, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని దాదా పు 70 శాతానికి తాగు, సాగునీరు అం దించే లక్ష్యంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబడుతున్నది. రెండున్నరేండ్లుగా ప్రాజెక్టును పడావు పెట్టి రాష్ట్రంలోని రైతులను అరిగోస పెడుతున్నది. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని ఆగం చేస్తూ అధికార పార్టీ ముఖ్యుల ఆదాయం పెంచుకునేలా ప్రస్తు త వ్యవహారం నడుస్తున్నది. తాగు, సాగునీరు లక్ష్యాన్ని పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బరాజ్‌ల వద్ద ఉన్న ఇసుకను అడ్డగోలుగా తోడుకొని సొమ్ము చేసుకునే కుట్రలను అమలు చేస్తున్నది. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వరద నీటిని ఒడిసిపట్టుకుని ప్రాజెక్టులతో పంటలకు అందించాల్సిన కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తిగా బాధ్యత మరచి వ్యవహరిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో వస్తున్న వరదను వృథాగా సముద్రంలోకి వదులుతూ గోదావరిలో కనిపించిన ఇసుకను తవ్వుకుంటున్నది. ఇసుకతో వచ్చే ఆదా యం మాయలోపడి ఎల్లకాలం నిలువాల్సిన బరాజ్‌ల భద్రతను పణంగా పెడుతున్నది.
భారీ యంత్రాలతో సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల పిల్లర్ల మధ్యలో ఇసుకను తవ్వుతున్నది. బరాజ్‌ల వద్ద తాత్కాలిక రోడ్లు వేసి ఇసుక రవాణా చేస్తున్నది. ప్రభుత్వ అనుమతులతోనే ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్నా.. తాగు, సాగునీరు సంగతిని పట్టించుకోకుండా బరాజ్‌ల మనుగడను ప్రమాదంలో పెడుతున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పిల్లర్ల మధ్యలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాల ప్రక్రియపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బరాజ్ వద్ద పూడిక తీసే ప్రక్రియ అని ప్రభుత్వం సర్ది చెప్పే ప్రయత్నం చేసినా.. సాగునీటి అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లేకుండా పిల్లర్లకు ప్రమాదం కలిగించేలా రోజూ వందల లారీల ఇసుకను తవ్వుతున్నారు. నీటి ప్రవాహం లేని కాలంలో గోదావరిలో ఇసుకను తవ్వి తీసి బయట పోసిన తర్వాత లారీల్లో లోడింగ్ చేసే ప్రక్రియను పక్కనబెట్టి బరాజ్ పిల్లర్ల వద్ద రాత్రీపగలు భారీ యంత్రాలతో ఇసుక లోడింగ్ చేస్తున్నారు. నిత్యం భారీ యంత్రాలు నడవడం, వందల లారీలు వచ్చి లోడ్‌తో పోతుండటంతో పిల్లర్లకు, మొత్తంగా బరాజ్‌కు ప్రమాదం కలిగిస్తున్నది. బరాజ్‌లకు సమీపంలోని గ్రావిటీ కెనాల్‌పై భారీ వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు. ఇసుక రవాణాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం వందల లారీలు భారీ లోడింగ్‌తో ఈ కెనాల్‌పై రాకపోకలు సాగిస్తున్నాయి.
ముఖ్యులకు ఆదాయ వనరుగా..
గోదావరి తీరం ఉన్న జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అధికార పార్టీ ముఖ్య నేతల ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. ఈ జిల్లాల్లోని ప్రభుత్వ క్వారీల నుంచి రోజూ 500 లారీల చొప్పున హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో ఈ ఇసుక రవాణా జరుగుతున్నది. గోదావరి నదిలోని అధికారిక రీచ్‌ల పరిధి దాటి ప్రభుత్వ అనుమతి లేని ప్రాంతంలోనూ ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. బరాజ్‌లు, పిల్లర్ల మధ్య ఉన్న ఇసుక తవ్వకాలు రీచ్‌ల లెక్కల్లోకి రాకుండా అక్రమంగా తరలిస్తున్నారు.