నాగర్‌కర్నూల్, జనవరి 22 : నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డ సమీపంలోని దుందు భీ నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. అక్కడి చేరుకున్న రెవెన్యూ, మైనింగ్, పోలీసులతో సైతం గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ భవన నిర్మాణాల పేరుతో తమ ప్రాంతం నుంచే ఎక్కువ మొత్తంలో ఇసుకను తరలించడం ఏమిటని ప్రశ్నించారు. అనుమతులు తీసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి ఇసుకను తరలించాల్సి ఉండగా, ఇసుక మాఫీయా అక్రమంగా అధిక మొత్తంలో తరలించి నిల్వ చేసుకుంటుందని ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టించి నిల్వ చేసుకున్న చోటునుంచి అధిక ధరలకు ప్రైవేట్‌గా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వ అనుమతులు ఎలా ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. ఒకరు అనుమతి తీసుకుంటే బారులుగా ట్రాక్టర్లను తీసుకువచ్చి రాత్రి, పగలు ఇసుకను తోడివేస్తున్నారని మండిపడ్డారు. పంట పొలాలకు నీటికోసం ప్రాణాలైనా అర్పించి ఇసుక తరలింపును అడ్డుకుంటామని భీష్మించి కూర్చున్నారు. ఓవైపు గ్రామస్తులు ఆందోళన చేస్తుండగా మరో వైపు ఇసుకను ట్రాక్టర్లలో నింపడంతో అధికారుల తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు. అధికారులతో ఇసుక మాఫియా కుమ్మక్కై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని అసహనం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక తరలింపును నిలిపివేయాలని డిమాండ్‌చేశారు.