కాశీబుగ్గ, డిసెంబర్ 9: రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు సముద్రాల పరమేశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ కాశీబుగ్గ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిశంకర్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. వేములవాడలోని 60 గోవులను అప్పజెప్తూ గోశాలలు లేని వ్యక్తికి మంత్రి సిఫార్సు లెటర్ ఇవ్వడం సరికాదని చెప్పారు.
గీసుగొండ: వేములవాడ రాజన్న కోడెలను అమ్ముకున్న వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా గీసుగొండ మండల సమన్వయ కమిటీ నాయకులు చల్లా వేణుగోపాల్‌రెడ్డి, బోడకుంట్ల ప్రకాశ్, జక్కు మురళి ఆరోపించారు. మంత్రి సురేఖ సిఫారసు లెటర్ ఇచ్చిన మాదాసి రాంబాబు కోడెలను అమ్ముకున్న విషయం బయటకు వచ్చినా వాస్తవం కాదని చెప్పడం సరైంది కాదన్నారు. కేసు నమోదు చేసి 10 రోజులు కావస్తున్నా నిందితుడిని ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించారు.
వేములవాడ: రాజరాజేశ్వరస్వామి దేవస్థాన గోశాల కోడెలను గోవధశాలకు విక్రయిస్తున్న మాదాసి రాంబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ వేములవాడ పట్టణాధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ రేగుల సంతోష్‌బాబు వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనుగొండకు చెందిన రాంబాబు సొసైటీ పేరుతో 60 కోడెలను రాజరాజేశ్వరస్వామి దేవాలయ గోశాల నుంచి తీసుకెళ్లి గోవధశాలలకు అమ్ముతున్నట్టు చెప్పారు.