హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : తమను రెగ్యులరైజ్ చేయాలని, బేసిక్ పే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న సమగ్ర శిక్షా ఉద్యోగులు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసన దీక్షలు చేపట్టనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఝాన్సీసౌమ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
గతేడాది సెప్టెంబర్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె చేస్తున్న సందర్భంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో హాజరైన రేవంత్రెడ్డి తమ ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే రెగ్యులరైజ్ చేస్తామని, బేసిక్ పే(మినిమం టైం సేల్) అమలుచేస్తామని హామీ ఇచ్చి, నేడు తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ 9 నెలల్లో ముఖ్యమంత్రితో సహా మంత్రులను అనేకసార్లు కలిసినా తమ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఆందోళనలకు సిద్ధమైనట్టు తెలిపారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆందోళనలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.