నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, డిసెంబర్ 28 :సీఎం రేవంత్‌రెడ్డి తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు 18 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. శనివారం సూర్యాపేటలోని ప్రధాన వీధుల గుండా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులు గాంధీ టోపీలు ధరించి నిరసన తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని ధర్నా చౌక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ చిత్రంతో కూడిన మాస్క్‌లు ధరించి ఉద్యోగులు నిరసన తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ వద్ద 18 రోజులుగా సమ్మె చేస్తున్న ఉద్యోగులు శనివారం రోడ్డు పక్కనే కూర్చొని భోజనాలు చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్షా ఉద్యోగులు శనివారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. వీరి సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతోనే ఉద్యోగులు రోడ్డెక్కాల్సి వచ్చిందని విమర్శించారు. అనంతరం ఉద్యోగులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేటలోని ఆదిశంకరాచార్య మిల్లులో పత్తి కొనుగోలు చేపట్టాలని కోరుతూ చెన్నూర్-మంచిర్యాల ప్రధాన రహదారిపై శనివారం రైతులు ధర్నా చేపట్టారు. మిల్లులో 2 రోజులుగా సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపట్టడం లేదని, అడిగితే ప్రైవేట్‌లో అమ్ముకోవాలని నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఎస్ఐ సుబ్బారావు, మార్కెట్ సెక్రటరీ రామాంజనేయులు చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
– చెన్నూర్ రూరల్
సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని అషాపుర జిన్నింగ్ మిల్లు వద్ద రైతులు రాస్తారోకో చేశారు. బేల ఎస్ఐ దివ్య భారతి, తహసీల్దార్ రఘునాథ్‌రావు చేరుకొని రైతులతో మాట్లాడి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సీసీఐ అధికారులతో మాట్లాడి పత్తి కొనుగోళ్లు చేపడుతామని కలెక్టర్ చెప్పడంతో రైతులు శాంతించారు.
– బేల