ఉమ్మడి పాలకులు కుట్రపూరితంగా పుష్కలంగా నీటి లభ్యత ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి బేసిన్లను వదిలి నీరు లభించని ప్రాంతాల్లో తెలంగాణ ప్రాజెక్టులను నిర్మించారు. అరకొర నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఆ ప్రాజెక్టుల్లో ప్రతిపాదిత లక్ష్యాన్ని చేరుకోకముందే పూడికతో నీటినిల్వ సామర్థ్యం పడిపోయింది.
మంజీరాపై అప్పటికే ఉన్న నిజాంసాగర్‌కు నిలువునా ఉరివేసినట్లుగా సింగూరు ప్రాజెక్టును నిర్మించారు. కేవలం దానిని హైదరాబాద్ తాగునీటి కోసమే పరిమితం చేశారు. మరోవైపు నిజాంసాగర్‌కు మరింతగా నీటిలభ్యత పడిపోవడంతో ఆయకట్టుకు పడావు పడ్డది. మానేరుపై ఎగువ మానేరు, దిగువ మానేరు ప్రాజెక్టులకు నీరురాని దుస్థితి. అయితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉమ్మడిపాలకులు సృష్టించిన శతకోటి సమస్యలకు పరిష్కారం చూపింది.
పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు భరోసానివ్వడమేగాక కొత్త ఆయకట్టుకు పురుడుపోస్తున్నది. ఎగువ నుంచి వరద వచ్చినా, రాకున్నా ఎల్లంపల్లికి, ఎగువ, మధ్య, దిగువ మానేరుకు కాళేశ్వర గంగ శాశ్వత భరోసా కల్పించింది. మంజీరా మొహం చాటేసినా, సింగూరుకు కాళేశ్వరం ఊపిరులూదింది. ఆయకట్టుకు మోక్షం లభించింది. హల్దీ వాగుద్వారా చారిత్రక నిజాంసాగర్‌కు ప్రాణహిత జలాలతో కాళేశ్వరం ప్రాణం పోస్తున్నది.