హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : ‘పది నెలలుగా జీతాల్లేవు.. ఇల్లు గడుస్తలేదు.. కూరగాయలు కూడా కొనలేకపోతున్నాం’ అని మిషన్ భగీరథ పథకంలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది గగ్గోలుపెడుతున్నది. పెం డింగ్ వేతనాన్ని గత జూలైలో ఇచ్చారని, ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18వేల మంది ఉద్యోగులు, సిబ్బంది మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.10వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ విధానంలో వీరు పని చేస్తున్నారు. వాల్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, సూపర్వైజర్లు, వాటర్ లైన్మన్లు నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూస్తుంటారు.
నెలల తరబడి పెండింగ్
ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన ఫైల్‌ను ప్రతినెలా ఆర్థికశాఖ క్లియర్ చేస్తుంది. మిషన్ భగీరథ సిబ్బంది వేతనాల ఫైల్ మాత్రమే క్లియర్ కావడం లేదా? ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదా? ఒక వేళ విడుదలైనా కాంట్రాక్టర్లు ఇవ్వడం లేదా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అని సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల సిబ్బందికి కొన్ని నెలల వేతనాలు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇంకా కొన్ని జిల్లాలకు ఇవ్వాల్సి ఉన్నదని అంటున్నారు. నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న తమకు పది నెలలుగా వేతనాలు అందడం లేదని ఆరోపిస్తున్నారు.
కేసీఆర్ హయాంలో ప్రతినెలా జీతాలు
గత కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఎక్కడా ఆటంకాలు తలెత్తకుండా ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షిత తాగునీరు అందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పథకం నిర్వహణ గాడితప్పింది. అనేక చోట్ల తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.