హైదరాబాద్: తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె (Sakala Janula Samme) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఉద్యమ సారథి కేసీఆర్ పిలుపుతో యావత్ తెలంగాణ సమాజం ఒక్కటైందని చెప్పారు. సబ్బండ వర్గాలు ఏకమై 42 రోజులపాటు శాంతియుతంగా నిరసన తెలిపి, తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేశారన్నారు. ఔర్ ఏక్ ధక్కా.. తెలంగాణ పక్కా అని దిక్కులు పిక్కటిల్లెలా తెలంగాణ ప్రజలు నినదించారని గుర్తుచేశారు. సకల జనుల సమ్మెకు శనివారంతో 14 ఏండ్లు పూర్తయిన సందర్భంగా.. సమ్మెలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
‘తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె. సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై, 42 రోజుల పాటు శాంతియుతంగా నిరసన తెలిపి, తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసిన మహోన్నత ఘట్టం సకల జనుల సమ్మె. సెప్టెంబర్ 12, 2011 రోజున కరీంనగర్ జనగర్జనలో ఉద్యమ సారథి కేసీఆర్ గారి పిలుపు మేరకు యావత్ తెలంగాణ సమాజం ఒక్కటయ్యింది. సమ్మెలో స్వచ్చంధంగా భాగస్వాములయ్యి, ఔర్ ఏక్ ధక్కా.. తెలంగాణ పక్కా అని దిక్కులు పిక్కటిల్లెలా తెలంగాణ ప్రజలు నినదించారు. నిర్బంధాలను ఛేదించి, ఆంక్షలకు ఎదురొడ్డి, బెదిరింపులను లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ బిడ్డలు పోరాడారు. సకల జనుల సమ్మెకు నేటితో 14 ఏళ్ళు నిండిన సందర్భంగా.. సమ్మెలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.