ఆయన తెలంగాణను శ్వాసించిండు. ఊరూరా ఉద్యమపాటై మోగిండు. దగాపడిన బతుకు వెతలను చూసి.. ధూంధూం వేదికలపై జనం గొంతుకయ్యిండు. ఉద్యమాన్ని ఆవాహన చేసుకుని.. ఉత్తేజపు పాటై మోగిండు. ప్రగతిని శ్వాసించిండు.. పాటగా మలిచిండు. ఆ పాటపిట్ట, పాలమూరు బిడ్డ సాయిచంద్(39). గుండెపోటుతో గురువారం రాత్రి ఆయన మృతిచెందారన్న వార్తతో తెలంగాణ దిగ్భ్రాంతికి గురైంది.
తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉర్రూతలూగించిన పాటల కెరటం అలసిపోయింది. తెలంగాణ ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన గొంతు మూగబోయింది. స్ఫూర్తిని రగిలించే పాటలతో ఉద్యమకారులను ఏకం చేసిన పాట మధ్యలోనే నిలిచిపోయింది. మలిదశ ఉద్యమం నుంచి తెలంగాణ ప్రగతి పరుగుల దాకా తోడున్న గళం.. ఇక సెలవంటూ వెళ్లిపోయింది. ఉడుకు నెత్తురు.. ఉద్యమ స్ఫూర్తి.. ఉప్పొంగిన గేయం దివంగతాలకు వెళ్లిపోయింది.
నిజమే అన్నా!
ఆ శివుడికి రక్తబంధం విలువ తెల్వదన్నా!
రాతి బొమ్మల్లోన కొలువైనోడే కదన్నా..
నువ్వు పాడినట్టే..
ఆయన నిర్దయుడు కాకపోతే..
నాలుగు పదులైనా నిండకముందే తీసుకెళ్తడా!
ఒక్క గుండెను ఆపి.. ఎందరిని ఏడిపిస్తున్నడు!
ఒక్క గొంతును చిదిమి..
ఎంత బాధపెడుతున్నడు
సాయిచందన్నా!
పాడువార్తతో ఈ పొద్దు
ఇలా మొదలైతదనుకోలె
ఊరూరా మోగిన ఉద్యమ గొంతుక
మధ్యలోనే మూగబోతనుకోలె
గుండెల్ని పిండేసిన పాట
ఇట్లా నడిమిట్ల ఆగిపోతదనుకోలె
నిజంగానే.. శివుడికి రక్తబంధం
విలువ తెల్వదన్నా!
లేకపోతే నీ జీవితాన్ని
సగంలోనే తుంచి
తెలంగాణను కన్నీటిలో ముంచేస్తడా!
అయితేనేం,
నీ జీవితం అమరం!
నీ పాట అజరామరం!
తెలంగాణ ప్రతిదినం
తలుచుకుంటది నీ గానం!!
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో/రంగారెడ్డి/వనస్థలిపురం, జూన్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (38) గుండెపోటుతో గురువారం హఠాన్మరణం చెందారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న ఆయనకు బుధవారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం నాగర్‌కర్నూల్‌లో ఓ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సాయిచంద్‌ను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ దవాఖానకు చేరుకొన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ‘నీకిష్టమైన హరీషన్న వచ్చాడు.. లే అన్నా.. అంటూ అక్కడున్న వారు రోదిస్తుంటే మంత్రి హరీశ్‌రావు కంటతడిపెట్టారు. అనంతరం సాయిచంద్ మృతదేహాన్ని గుర్రంగూడలోని ఆయన నివాసానికి తరలించారు.
సాయిచంద్ మృతదేహానికి నివాళులు అర్పించిన మంత్రులు సహా ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమకలాకర్, సత్యవతిరాథోడ్, మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎంపీలు గడ్డం రంజిత్‌రెడ్డి, రాములు, బీబీ పాటిల్, విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజ్, మండలి విప్ కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎల్ రమణ, గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు ఎం కిషన్‌రెడ్డి, డీ సుధీర్‌రెడ్డి, క్రాంతికిరణ్, కే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, రాజయ్య, ఏ వెంకటేశ్వర్‌రెడ్డి, కే భూపాల్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భగత్‌కుమార్, గోపీనాథ్, లక్ష్మారెడ్డి, రసమయి బాలకిషన్, పట్నం నరేందర్‌రెడ్డి, గాదరి కిశోర్, కార్పొరేషన్ చైర్మన్లు గజ్జల నగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బాజిరెడ్డి గోవర్ధన్, రావుల శ్రీధర్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఆయాచితం శ్రీధర్, ఆంజనేయగౌడ్, పల్లె రవికుమార్‌గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, జగన్మోహనరావు, సర్దార్ రవీందర్‌సింగ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్పీఎస్సీ సభ్యుడు కారం రవీంద్‌రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితా హరినాథ్‌రెడ్డి, ఇతర పార్టీల నాయకులు నివాళులర్పించారు.
సాయిచంద్ మృతదేహానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి నివాళులు అర్పించే సమయంలో మంత్రి కేటీఆర్ కంటతడిపెట్టారు. సాయిచంద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తన అరుదైన కళానైపుణ్యం, గాత్రంతో అలరించిన తమ్ముడు సాయిచంద్ మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఉద్యమ సహచరుడి మృతి తీరని లోటని అన్నారు. ‘ఆయన కుటుంబాన్ని చూస్తే చాలా బాధేస్తున్నది. వారిని ఎంత ఓదార్చినా..సర్దిచెప్పే పరిస్థితి మాకెవరికీ లేదు..సాయిచంద్ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం’ అని చెప్పారు.
సాయిచంద్ లేడని ఊహించుకుంటేనే బాధగా ఉన్నదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. చిన్నవయసులోనే సాయి చనిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ‘నా మనసుకు చాలా దగ్గరైన వ్యక్తి. చాలాసార్లు మా ఇంటికి వచ్చాడు. సాయిని మళ్లీ తిరిగి తెచ్చుకోలేం. ఆత్మకు శాంతిచేకూరాలి’ అని పేర్కొన్నారు.
సాయిచంద్ మరణవార్త విని బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కళాకారులు గుర్రంగూడలోని ఆయన స్వగృహానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. పెద్ద దిక్కుగా ఉంటున్న సాయిచంద్ మరణం కుటుంబ సభ్యులను కలిచివేసింది. భర్తను తలుచుకొని విలపించిన సాయిచంద్ భార్య రజినీని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మరోవైపు సాయిచంద్ కొడుకు చరీశ్, కూతురు నది, తండ్రి వెంకట్రాములు రోదించిన తీరు కలిచివేసింది. తెలంగాణ సాంస్కృతిక సారథి, అరుణోదయ, ప్రజానాట్య మండలి కళాకారులు ‘జోహార్ సాయిచంద్’ అంటూ నివాళులర్పించారు.
గుర్రంగూడలోని నివాసానికి గురువారం ఉదయమే వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి .. సాయంత్రం వరకు అక్కడే ఉండి సాయిచంద్ అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రులు, ప్రజాప్రతిననిధులు, అభిమానులు సంతాపం తెలిపిన అనంతరం సాయిచంద్ అంతిమయాత్ర ప్రారంభమైంది. మంత్రి నిరంజన్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, క్రాంతి కిరణ్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి కొద్దిసేపు పాడె మోశారు. సాహెబ్‌నగర్‌లోని శ్మశాన వాటిక వరకు సాగిన అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ యాత్ర ముందు కళాకారులు ‘సాయిచంద్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేస్తూ పాటలతో ఆయనను గుర్తు చేసుకొన్నారు. బాల్క సుమన్ దగ్గరుండి సాయిచంద్ కుమారుడితో అంతిమ సంస్కారాలు చేయించారు.
సాయిచంద్‌ను కాపాడుకొనేందుకు బీఆర్ఎస్ పార్టీ శతవిధాలా ప్రయత్నించింది. బుధవారం అర్ధరాత్రి సాయిచంద్‌కు గుండెపోటు రాగానే… మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో ముందుగానే ఎంపీ సంతోష్‌కుమార్ గచ్చిబౌలిలోని కేర్ దవాఖానలో సిద్ధంగా ఉన్నారు. వైద్యులతో మాట్లాడి.. చికిత్స అందేలా చూశారు. మంత్రి హరీశ్‌రావు కూడా దవాఖానకు చేరుకొన్నారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. వైద్యులు సాయిచంద్ మరణాన్ని ధ్రువీకరించిన తర్వాత భౌతిక కాయాన్ని గుర్రంగూడకు తరలించారు. కుటుంబ సభ్యులకు కొండంత అండగా నిలిచేందుకు గులాబీ దళం అంతా అక్కడకు చేరుకొన్నది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విప్ బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ దగ్గరుండి అన్నీ తామై చూసుకున్నారు. సాయిచంద్‌కు గతంలోనే 2008లో ఒకసారి గుండెపోటు వచ్చినట్టు ఆయన మిత్రులు తెలిపారు. మహబూబాబాద్‌లో సాయిచంద్ తన పాటలను రికార్డింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురికావడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించి, చికిత్స అందించారు. అప్పట్లో ఆయన ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు. కానీ ఈసారి మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు.
సాయిచంద్ జీవితం అంతా పాటతోనే ముడిపడి ఉన్నది. అమరచింత నుంచి హైదరాబాద్‌కు మారినా పాటతోనే దోస్తీ చేశాడు. వనపర్తి జిల్లా అమరచింతలో సెప్టెంబర్ 20, 1984లో మణెమ్మ, వెంకట్రాములు దంపతులకు సాయిచంద్ జన్మించారు. చిన్నతనంలోనే తల్లి మణెమ్మ బట్టలు ఆరేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మరణించింది. ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి పదో తరగతి వరకు అమరచింతలో పూర్తిచేశారు. మేనత్త దగ్గర ఉంటూ… ప్రభుత్వ పాఠశాల, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పదో తరగతి వరకు చదువుకున్నారు. తండ్రి అరుణోదయ సంస్థలో పని చేస్తూ విప్లవ గీతాలు ఆలపిస్తుండటంతో సాయిచంద్‌కు కూడా ఆ పాటలు ఒంటబట్టాయి. హైదరాబాద్ వివేకానంద ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందారు. 2011లో తన ఉద్యమ సహచరిణి రజినితో సాయిచంద్‌కు ప్రేమ వివాహం జరిగింది.
సాయిచంద్ విద్యార్థి సంఘ నాయకుడిగా ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో మమేకం అయ్యారు. తన ఆటపాటలతో ఉద్యమానికి తన వంతుగా ఉత్తేజాన్ని ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్ర పునర్నిర్మాణంలో సాయిచంద్ తన గళాన్ని జోడించారు. సీఎం కేసీఆర్ సభలు ఎక్కడ జరిగినా… సభికుల్లో ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా సాయిచంద్ తన ఆట పాటలతో గంటలకొద్దీ కట్టిపడేసేవారు. ఇటీవల వరుసగా జరిగిన సీఎం కేసీఆర్ పర్యటనలతోపాటు రాష్ట్ర ప్రస్థానంలో కీలకమైన సచివాలయ ప్రారంభోత్సవం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాల్లో తాను రచించిన పాటలతో అలరించారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛనును రూ.3,016 నుంచి రూ.4,106కు పెంచుతూ కొన్నిరోజుల కిందట సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఈ క్రమంలో దానిపై సీఎం కేసీఆర్‌కు దివ్యాంగుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఒక పాటను రూపొందించేందుకు చర్చలు కూడా జరిపామని, కొన్నిరోజులైతే ఆ పాట తెర మీదకు వచ్చేదని తెలంగాణ వికలాంగుల సంక్షేమ సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి గుర్తు చేసుకొన్నారు. సీఎం కేసీఆర్ ఆయన సేవలను గుర్తించి 2021 డిసెంబర్ 15న తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌గా నియమించారు. అప్పటినుంచి అటు ఆ పదవికి న్యాయం చేస్తూనే.. అన్ని సభల్లో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పాటను వినిపిస్తున్నారు.
ఉద్యమ గాయకుడు సాయిచంద్ మరణవార్త తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గుర్రంగూడలోని నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. సాయిచంద్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి, అంజలి ఘటించారు. సాయిచంద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాయిచంద్ భార్య, పిల్లలు కేసీఆర్ కాళ్లపై పడి రోదించారు. ‘సార్ సాయిని పిలువండి.. లేవమనండి.. మీరు పిలిస్తే లేచి వస్తాడు సార్’ అని సాయిచంద్ భార్య రజిని రోదించడంతో సీఎం కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టారు. అక్కడే ఉన్న సాయిచంద్ తండ్రి వెంకట్రాములును ఓదార్చారు. కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా..
రక్తబంధం విలువ నీకు తెలియదు రా..
నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మ దేవా..
తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా…
ఉద్యమానికి సాయిచంద్‌ను పరిచయం చేసిన పాట..
ఇది అప్పట్లో అందరినీ కంట తడి పెట్టించింది. స్వరాష్ట్ర సాధనకు సాయిచంద్ గళం ఎంతోగానే దోహదపడింది. ఆపై తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రతి అడుగునా సాయిచంద్ గళం ఖంగుమంటూనే ఉంది. తెలంగాణ అభివృద్ధి-సంక్షేమాన్ని తన పాటలతో విస్తృత ప్రచారం చేస్తూనే ఉన్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా సినిమాల్లోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న సాయిచంద్… చివరగా ‘శరపంజరం’ అనే సినిమాకు పాట పాడారు. నాడు తెలంగాణ ఉద్యమ అమరవీరులపై పాట పడిన ఆయన… చివరగా పాడిన సినిమా పాట కూడా అదే మరణంపై సాగడం యాదృశ్చికం.
కాటిల పేర్చిన కట్టె నీతో రాదూ..
గూటిల చేర్చిన గవ్వ నీతో లేదూ…
కాళ్లులేని గడ్డి మంచాన
నలుగురు మోసే పాడె పైన
అగ్గిని పేర్చిన ఇంటిలోన…
ఇల్లుగ మారిన మట్టిలోన…
భస్మమై మారె నీ దేహమూ…
మాయపోయె నీ దీపమూ…
-సాయిచంద్ చివరగా పాడిన సినిమా పాట
నాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మందిని ఉర్రూతలూగించి, నేడు స్వరాష్ట్ర అభివృద్ధి విధానాన్ని ప్రజలకు పాట రూపంలో చెప్తున్న గొంతుక మూగబోయింది. తెలంగాణ ఉద్యమగాయకుడు, నాకు అత్యంత ఆత్మీయుడు, తమ్ముడు సాయిచంద్ మృతి అత్యంత బాధాకరం. వ్యక్తిగతంగా, పార్టీపరంగా తీరనిలోటు. సాయిచంద్ భౌతికంగా మన మధ్య లేకున్నా పాట రూపంలో, తెలంగాణ ఉద్యమ గుర్తుగా అందరి గుండెల్లో చిరకాలం ఉంటాడు. జోహార్ సాయిచంద్.
-మంత్రి హరీశ్‌రావు
తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడు..రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ తన పాటతో ఎందరి హృదయాలనో కదిలించిన సోదరుడు సాయిచంద్ అకాల మరణం నన్ను ఎంతో కలిచివేసింది. సాయిచంద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా.
-ఎమ్మెల్సీ కే కవిత
సాయిచంద్ హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది. తెలంగాణ సమాజం గొప్ప ప్రజా కళాకారుడిని కోల్పోయింది. ప్రత్యేక తెలంగాణ సాంసృతిక ఉద్యమంలో, రాష్ట్ర సాధన తర్వాత ప్రగతి గానంలో సాయిచంద్ పాత్ర మరువలేనిది. సాయిచంద్ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
-దివకొండ దామోదర్‌రావు, రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ సీఎండీ