హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): అమ్మిన ప్లాట్లనే మళ్లీ మళ్లీ అమ్ముతూ అమాయకులను వంచించి రూ.2.10 కోట్లకుపైగా వసూలు చేసిన సాయి నిఖిత ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీసీఎస్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్‌ని అమీర్‌పేట్‌లో కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు హబ్సిగూడలో మరో శాఖ ఉన్నది. ఈ సంస్థ డైరెక్టర్ పుల్గమ్ దివ్య, మార్కెటింగ్ డైరెక్టర్ బొక్క దుర్గాప్రసాద్ మరికొందరు కలిసి బీబీనగర్‌లో ‘బృందావన్-11’ పేరుతో డీటీసీపీ లేఔట్లో ప్లాట్లు విక్రయిస్తున్నామని, డీటీసీపీ అనుమతులు వచ్చాయంటూ పలువురు కస్టమర్లను కలిశారు. ఈ క్రమంలో మల్కాజిగిరికి చెందిన నగేశ్‌తోపాటు రమ్యకృష్ణ, సూర్యకిరణ్, సంధ్య, సంగీత, వెంకటసబ్బయ్య, సతీశ్ తదితరులు ఆ ప్లాట్లను కొనేందుకు ముందుకు రావడంతో.. ముందుగా టోకెన్ అమౌంట్ చెల్లించాలని, ఆ తర్వాత మొత్తం అమౌంట్ చెల్లించాక రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మించారు. వారిలో కొందరు మొత్తం నగదు చెల్లించినా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాకుండా నాలుగైదు నెలలపాటు కాలయాపన చేస్తూ వచ్చారు. దీనిపై బాధితులు లోతుగా ఆరా తీయడంతో వారికి అమ్ముతామని చూపిన ప్లాట్లను ఇదివరకే ఇతరులకు విక్రయించినట్టు బయపడింది. అనంతరం వారు తమ డబ్బులను తిరిగి ఇచ్చేయాలని కోరినా ఆ రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో న్యాయం కోసం బాధితులు సీసీఎస్‌ను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.