TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ డీఏఓ(డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్) ప్రశ్నాపత్రం లీకేజి కేసులో ఖమ్మం జిల్లాకు చెందిన సాయి లౌకిక్, సుష్మిత దంపతులకు రెండో రోజు పోలీసు కస్టడీలో భాగంగా విచారణ జరిగింది. ఇందులో భాగంగా సిట్ అధికారులు సాయి లౌకిక్, సుష్మిత దంపతులను తీసుకుని ఖమ్మంలోని వారి నివాసానికి వెళ్లారు. ఏడుగురు సభ్యులతో వెళ్లిన అధికారులు దాదాపు 4 గంటల పాటు నిందితులు సహా వారి కుటుంబ సభ్యులు(సాయి లౌకిక్ తల్లిదండ్రులు)ను విచారించారు.
అంతే కాకుండా వారి ఇంటిలో సోదాలు జరిపారు. సెల్ఫోన్లు, కాల్ లిస్ట్, వాట్సాప్ చాట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో సాయి లౌకిక్ బ్యాంక్ ఖాతాలో నుంచి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌రెడ్డి ఖాతాలోకి రూ. 6 లక్షలు వెళ్లినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో మరింత లోతుగా అధికారులు విచారణ చేపట్టారు. ప్రవీణ్ నుంచి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసిన నిందితులు స్థానికంగా మరెవరికైనా ఆ పేపర్‌ను విక్రయించారా అనే కోణంలో సిట్ విచారించినట్లు సమాచారం.