హైదరాబాద్ : పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జలమండలి ఆధ్వర్యంలో మురుగునీటి నిర్వహణ, కార్మికుల భద్రతపై నిర్వహిస్తున్న భద్రతా పక్షోత్సవాలలో భాగంగా శనివారం మారేడ్‌పల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన అవగాహన కార్యక్రమానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మ్యాన్ హోల్స్ పూడికతీత పనుల్లో మానవ ప్రమేయం లేకుండా అవసరమైన చోట్ల కొత్త టెక్నాలజీని వినియోగించాలని సూచించారు.
రోబోటిక్ టెక్నాలజీతో మ్యాన్ హోల్స్‌ను శుద్ధి చేసే ప్రక్రియను ఇప్పటికే సనత్ నగర్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారని, ఇది విజయవంతమైందని.. త్వరలోనే నగర వ్యాప్తంగా ఈ విధానం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తా చెదారాన్ని మ్యాన్ హోళ్లలో వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణలో జలమండలికి పోటీగా దేశంలో ఏ నగరం కూడా దరిదాపుల్లో కూడా రాదని కొనియాడారు.
జలమండలికి ఇప్పటికే వివిధ కేటగిరీల్లో ఎన్నో కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయని.. ఎండీ దాన కిశోర్ గారి సారథ్యంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం జలమండలి ఎండీ దాన కిశోర్ మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీ సాయన్న, కార్పొరేటర్లు, జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎంలు ప్రభు, ప్రసన్న కుమార్, వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షలు రాంబాబు యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాలు, ఎన్జీఓలు తదితరులు పాల్గొన్నారు.