హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): నేడు సద్దుల బతుకమ్మ.. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక్క మహిళకు, ఒక్క చీర కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆడపడుచులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహిళలు సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. ఈ ఏడాది బొడ్డెమ్మ పండుగకు చీర ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. కానీ చీర ఇవ్వలేదు. ఆ తర్వాత ఎంగిలి పూల బతుకమ్మకు అన్నారు.. సద్దుల బతుకమ్మకు వాయిదా వేశారు.
ఇప్పుడు సద్దుల పండుగ రానే వచ్చింది. చీర మాత్రం ఇవ్వకుండా కాంగ్రెస్ పాలకులు మోసానికి పాల్పడ్డారని మహిళలు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి రాక ముందు ఒక్కో మహిళకు రెండు చీరలు ఇస్తామంటూ ఆర్భాటపు ప్రచారం చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఉచిత చీరల పంపిణీ పథకాన్నే పక్కకు పెట్టిందని కాంగ్రెస్ సర్కార్‌పై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. ఇదే విధంగా నిరుడు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్న రేవంత్‌రెడ్డి సర్కారు.. ఇప్పుడు కూడా సాకులు చెప్తూనే చీరలు ఇవ్వడంలేదని దుయ్యబడుతున్నారు.
రాష్ట్రంలోని స్వయం సహాయ సంఘాల(ఎస్‌హెచ్‌జీ)లోని 60 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రెండు చొప్పున మొత్తం 1.20 కోట్ల చీరలు ఇస్తామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, సీఎం దగ్గరుండి డిజైన్లు ఖరారు చేశారని, నాణ్యమైన చీరలు ఇస్తామంటూ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు జోరుగా ప్రచారం చేశారు. తీరా సద్దుల బతుకమ్మ వచ్చినా.. ఒక్క చీర ఇవ్వకపోవడంతో ప్రభుత్వం మాటలు చెప్పిందని, చేతలు మరిచిందని మహిళలు మండిపడుతున్నారు. ఎస్‌హెచ్‌జీ మహిళలతోపాటు నేత కార్మికులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విపక్షాల నేతలు మండిపడుతున్నారు. చీరల తయారీ బాధ్యతలను తెలంగాణ కార్మికులకు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరల పథకం బ్రహ్మాండంగా కొనసాగిందని మహిళా సంఘాల నేతలు గుర్తుచేస్తున్నారు. మహిళలందరికీ కాకుండా స్వయం సహాయక బృందాల సభ్యులకు మాత్రమే రెండు చీరల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్.. అసలుకే ఎసరు పెట్టిందని చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలో (2024లో) ఒక్క చీర కూడా ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడుతున్నారు. ఈ సారి కూడా చీరలు ఇవ్వకుండా.. మోసానికి పాల్పడిందని గుర్రుగా ఉన్నారు.
చీరల పథకం నిధులలో దాదాపు రూ.300 కోట్ల వరకు కమీషన్ల కోసం అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే చీరలు సమయానికి తయారు కాలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరాకు చీరలు ఇవ్వలేకపోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కార్మికులు సకాలంలో చీరలు తయారు చేయలేదంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చీరలు ఇస్తుందన్న నమ్మకం లేదంటూ మహిళా సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.