హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): అటవీ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలు మరువలేనివని, అడవుల సంరక్షణ కోసం వారు చేసిన ప్రాణత్యాగాలకు విలువకట్టలేమని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొడెం వీరయ్య పేర్కొన్నారు. అటవీ శాఖ అమరవీరుల దినం సందర్భంగా బుధవారం నెహ్రూ జూలాజికల్ పార్లోని అమరుల స్మారక చిహ్నం వద్ద పోడెం వీరయ్య, అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి ఆర్ఎం డోబ్రియాల్ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. అడవులకూ, ఆదివాసీలకు అవినాభావ సంబంధం ఉన్నదని, నిజమైన అడవుల పరిరక్షకులు ఆదివాసీలేనని చెప్పారు. అడవుల పరిరక్షణ మనందరి బాధ్యత అని తెలిపారు. ఆర్ఎం డోబ్రియల్ మాట్లాడుతూ.. 1984 నుంచి ఇప్పటివరకు విధి నిర్వహణలో 22 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారంటూ వారి సేవలను స్మరించుకున్నారు.
ఐఎంజీ భారత్‌కు భూములపై పిటిషన్లు కొట్టివేత
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): నాటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన 855 ఎకరాల భూమి, పలు క్రీడా స్టేడియాల నిర్వహణను ఐఎంజీ భారత్ అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఓ ప్రజాహిత వ్యాజ్యంతోపాటు పలు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఐఎంజీబీకి భూముల కేటాయింపుల వ్యవహార అంశాలు గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భార్య విజయమ్మ వేసిన పిల్లో, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి దాఖలు చేసిన క్రిమినల్ కేసులోనూ ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావుతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వీటి గురించి చెప్పకుండా సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్, ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది శ్రీరంగారావు 2012లో దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. చట్టం చదరంగం ఏమీ కాదని ఘాటుగా స్పందించింది. నాటి క్రీడల మంత్రి పీ రాములుకు విజయసాయిరెడ్డి రాజకీయ ప్రత్యర్థి అని గుర్తుచేసింది.