హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ‘ఒక ముఖ్యమంత్రివి అయ్యుండి.. విద్యాశాఖను కూడా చూస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి స్వేచ్ఛగా పోలేరా?’ అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి నిలదీశారు. పోలీసు పహారా, బారికేడ్లు, అంక్షలు, భారీ బందోబస్తు మధ్య ముఖ్యమంత్రి ఓయూ పర్యటనకు వెళ్లడంపై సోమవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘యూనివర్సిటీలో అప్రకటిత కర్ఫ్యూ విధిస్తారా? విద్యార్థుల హకులను కాలరాస్తారా? ఇనుప కంచెలు, బారికేడ్లు లేని ప్రజాపాలన అని చెప్పినోళ్లు సోమవారం ఓయూలో కంచెలెందుకేశారు? బారికేడ్లు ఎందుకు పెట్టారు? బెటాలియన్ల కొద్దీ పోలీసులతో ఎందుకు మోహరించారు. నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు సూటీలేవీ అని విద్యార్థులు, యువతీయువకులు అడుగుతారని వర్సిటీని పోలీసు సిటీగా మార్చారా?’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు.
‘ఇనుప కంచెలు పెడితే విద్యార్థుల బాధలు తొలిగిపోతాయా? ఫీజు రీయింబర్స్మెంట్, ఓవర్సీస్ సాలర్ షిప్‌లు రాక పడుతున్న అవస్థలు తొలగిపోతాయా?’ అంటూ నిలదీశారు. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియకుండా పోతాయా?’ అని నిలదీశారు. ‘ఇది ప్రజా పాలన కాదు.. ఎమర్జెన్సీ పాలన’ అంటూ మండిపడ్డారు. నిషేధాలు, ఆంక్షలు, అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టంచేశారు. ‘పంచడానికి భూముల్లేవు.. ఇవ్వడానికి ఖజానా లేదంటూనే ఓయూకు ఎన్ని కోైట్లెనా ఇస్తామనటం ద్వంద్వవిధానం కాదా? ఎంతైనా ఇస్తామని చెప్పి నయా పైసా విదిల్చలేదెందుకు? భూముల్లేవంటూనే సెంట్రల్ యూనివర్సిటీ స్థలాన్ని ప్లాట్లు చేసి అమ్మాలనుకున్న విషయాన్ని తెలంగాణ సమాజం మరిచిపోదు’ అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే ఆలోచన నుంచి బయటపడి, కేసీఆర్ సర్కారు విజన్‌ను కొసాగించాలని హితవుపలికారు.
అవి మేము కట్టినవే
రేవంత్‌రెడ్డి ప్రారంభిన హాస్టళ్లు గత బీఆర్ఎస్ సర్కారు నిర్మించినవేనని గుర్తుంచుకోవాలని సబిత సూచించారు. కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు రూ. 283 కోట్లతో విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం భవనాలు నిర్మించామని, వాటిని ఇప్పుడు ప్రారంభించి గొప్పలు చెప్పుకోవడం తగదని చురకలంటించారు. కేసీఆర్ హయాంలో శంకుస్థాపన చేసి నిర్మించిన వాటిని ప్రారంభించడమంటే.. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగం పొందిన వారికి నియామక పత్రాలు ఇచ్చినట్టేనని యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ‘జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలన్నారు.. 22 నెలల్లో అందులో రెండు శాతం కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు’ అని విమర్శించారు. ఓయూలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యనూ సబిత తప్పుబట్టారు.
‘కేజీ టూ పీజీ ఉచిత విద్య, 1200కు పైగా గురుకులాలు, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలు, సైనిక్‌స్కూళ్లు, అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సుతో నడిచే కాలేజీలను మేము ఏర్పాటు చేసింది పేద బడుగు బలహీనవర్గాల కోసం కాదా? మేం మాటలు కాదు.. చేతల్లో చూపించినం. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి’ అని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో 21 మెడికల్, కాలేజీలు, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశామని, హార్టికల్చర్, ఫారెస్ట్ వర్సిటీలు మహిళా వర్సిటీలను నెలకొల్పామని పేర్కొన్నారు. ఇవన్నీ పేద, బడుగు బలహీన వర్గాల కోసమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ‘ఈ రోజు మీ పాలనలో గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. విద్యార్థులకు మంచి భోజనం పెట్టలేని మీరా? మా గురించి మాట్లాడేది?’ అంటూ ఫైర్ అయ్యారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అటకెక్కించారు. ఓవర్సీస్ స్కాలర్షిష్కు ముగింపు పలికారు. మన ఊరు -మన బడిని ఎత్తేశారు’ అంటూ దుయ్యబట్టారు.