హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సిట్ల ముసుగులో శిఖండి రాజకీయాలు చేస్తున్నదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని ఓర్వలేకే తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నదని ఆరోపించారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, కార్పొరేటర్ రాసూరి సునీత, మేఘన, శాంతీనాయక్, షకీలారెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు రాగానే సీఎం రేవంత్‌రెడ్డి నక్కజిత్తుల రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.
కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే సర్కార్ కక్ష సాధిస్తున్నదని నిప్పులు చెరిగారు. ఫోన్‌ట్యాపింగ్ పేరిట ఆయనను బద్నాం చేసేందుకు కుట్రలకు దిగుతున్నదని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాకు నోటీసులు ఇస్తే వేధింపులని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు, మరి కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసులు వేధించేందుకు కాదా? అని ప్రశ్నించారు. వారి పార్టీ అగ్రనేతలకు ఓ నీతి.. బీఆర్ఎస్ నేతలకు మరో నీతా? అని నిలదీశారు.
కేసీఆర్ పాలనా ఆనవాళ్లను చెరిపివేసే కోణంలోనే విచారణల పేరిట బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో ఈ ఫార్ములా, ఇప్పుడు ఫోన్‌ట్యాపింగ్ కుట్రలో కేటీఆర్‌ను ఇరికించేందుకు కుతంత్రాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గేదిలేదని స్పష్టంచేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు.
పాలనను, రైతుల కష్టాలను గాలికొదిలి ప్రతిపక్షంపై కాంగ్రెస్ సర్కార్ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నదని ఎమ్మెల్సీ వాణీదేవి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా హామీల అమలుపై దృష్టిపెట్టి ప్రజలకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
టీడీపీలో చేరి ఆ పార్టీని బొందపెట్టిందే ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. షార్ట్‌కట్‌లో ముఖ్యమంత్రి పీఠమెక్కిన ఆయన అసలు కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టారని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలు చేయడంలో ఆయన దిట్ట అని ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతున్న భాష వింటుంటే మానసిక స్థితిపై అనుమానం కలుగుతున్నదని తెలిపారు. పాలన, ప్రజాసమస్యలను అటకెక్కించి యథేచ్ఛగా దోపిడీ పర్వానికి తెరలేపారని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో జరిగిన కుంభకోణాలను బట్టబయలు చేసిన బీఆర్ఎస్ నేతలపై సర్కార్ కక్ష సాధిస్తున్నదని మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టిన 24 గంటల్లోనే హరీశ్‌రావుకు సిట్ నోటీసులు జారీ చేసిందని గుర్తుచేశారు. అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్‌పై ఫోన్‌ట్యాపింగ్ నిందలు మోపుతునన్దని దుయ్యబట్టారు. పాలన చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని ధ్వజమెత్తారు. కేసులు, విచారణలతో బీఆర్ఎస్ను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తంచేశారు.