SSC Exam Paper Leak | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): పదో తరగతి ప్రశ్నపత్రాలు వరుసగా వాట్సాప్‌ల్లో ప్రత్యక్షం కావటాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొన్నది. రెండు రోజుల పాటు ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంపై పరీక్షల సిబ్బందికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడే వారిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షం కావటంతో పరీక్షల నిర్వహణపై మంగళవారం బీఆర్కే భవన్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిగిలిన 4 పరీక్షల నిర్వహణలో కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. పరీక్షల నిర్వహణలో 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను పటిష్ఠంగా అమలు చేసి, జిరాక్స్ షాప్‌లను మూసివేయించాలని తెలిపారు.
పదో తరగతి పరీక్షల విషయంలో వాస్తవాలను తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేలా ప్రతిపక్షాలు దుందుడుకుగా వ్యవహరిస్తున్నాయని మంత్రి సబిత ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు విద్యార్థులను పావుగా ఉపయోగించుకోవడం ప్రతిపక్షాలకు తగదని సూచించారు. ఈ సందర్భంలో రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం దివాళాకోరు విధానానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రతిపక్షాలు చేసున్న కుట్రలో బలికావొద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రెండు పరీక్ష పత్రాలు లీక్ అయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పషతనిచ్చారు. కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, పోలీస్ రేంజ్ ఐజీలు షానవాజ్ ఖాసీం, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పదో తరగతి పరీక్షలకు మంగళవారం 99.63 శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు అధికారలు ప్రకటించారు. రెండో భాష (హిందీ) పేపర్‌కు పరీక్షను నిర్వహించగా మొత్తంగా 4,85,993 మంది విద్యార్థులకుగానూ 4,83,911 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. బుధవారం సెలవు కాగా, ఇంగ్లిష్ పరీక్షను గురువారం నిర్వహిస్తారు.
వరుసగా ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షం కావడంపై ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. సోమ, మంగళవారాల్లో జరిగింది పేపర్ లీకేజీ కాదని, పేపర్ ఔట్ మాత్రమేనని స్పష్టతనిచ్చారు. పరీక్షకు ముందు పేపర్ బయటికొచ్చి ఇతరుల చేతిలో పడితేనే పేపర్ లీకేజీగా భావించాలని, పరీక్ష ప్రారంభమయ్యాక పేపర్లు బయటికొస్తే పేపర్ ఔట్‌గా పరిగణించాలన్నారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో విద్యార్థులు ఉండటంతోపాటు, బయటి నుంచి పరీక్ష కేంద్రాల్లోకి ఇతరులెవరు ప్రవేశించే అవకాశం లేకపోవటంతో దీన్ని పేపర్ ఔట్‌గానే చూడాలని వివరణ ఇచ్చారు. పరీక్ష సమయంలో పేపర్లు బయటికొచ్చినా ఆన్సర్లు చూసుకొని రాసుకొనే అవకాశం ఉండదని వెల్లడించారు.