హైదరాబాద్: ప్రజల సమస్యలపై పోరాడే నేతలను ఇండ్లకు పరిమితం చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికే అవమానకరమన్నారు. ఆర్టీసీ చార్జీల భారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని నిర్బంధించడం కాంగ్రెస్ సర్కార్ అసహన వైఖరికి నిదర్శనమని చెప్పారు. ప్రజాగళాన్ని అణచివేయాలనే ధోరణి స్పష్టంగా బయటపడిందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదని వెల్లడించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.
బస్ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నాని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బస్ చార్జీలు తగ్గించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
శాంతి యుతంగా చేస్తున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తున్నదని ధ్వజమెత్తారు. పెంచిన చార్జీలపై జవాబు చెప్పలేక అణచివేత చర్యలకు దిగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ అరెస్టులతో వెనక్కి తగ్గబోమని, పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.