హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం పాజెక్టును న్యాయస్థానాలు కూడా ప్రశంసిస్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగెస్ సర్కారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్య, ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమేనని విమర్శించారు. కాళేశ్వరం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన ఈ పాజెక్టు తెలంగాణలో వ్యవసాయరంగానికి జీవనాడి అని కొనియాడారు.
దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రశంసించారని, న్యాయస్థానాలు కాళేశ్వరం ప్రాముఖ్యతను గుర్తించాయని చెప్పారు. కాంగెస్ సర్కారు తమ వైైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నదని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు పరిపాలన చేతగాక, ఆరు గ్యారెంటీలను, ఇతర హామీలను అమలు చేయలేక, కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతున్నదని ఎక్స్ వేదికగా నిప్పులుచెరిగారు.
కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం కేవలం రాజకీయ దురుద్దేశపూరిత చర్య అని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని, పారదర్శకంగా, నిబంధనలకు లోబడి నిర్మాణం జరిగిందని చెప్పారు. తమ ప్రభుత్వంలో 20-30 శాతం కమీషన్లు లేకుండా ఏ పనీ జరగడంలేదని కాంగెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా చెప్తున్నారని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం పాజెక్టును వైఫల్యంగా చిత్రీకరించడానికి, రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవడానికి బీజేపీ-కాంగెస్ కూటమి కుట్ర పన్నుతున్నదని, కేసీఆర్‌కు ఘోష్ కమిషన్ నుంచి వచ్చిన నోటీసులు ఆ ఎజెండాలో భాగమేనని విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకముందని, ఎన్ని నోటీసులు ఇచ్చినా, అవి దూది పింజల్లా ఎగిరిపోతాయని తేల్చిచెప్పారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు.
హైదరాబాద్ మే 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేధించేందుకే కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిందని, సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఈ విషయం తేటతెల్లమైందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను ఎదుర్కొలేక కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కొని రాజకీయ కుట్రలకు తెరలేపాయని విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురుదక్షిణ కోసమే మేడిగడ్డను మాయం చేసే పన్నాగానికి దిగుతున్నారని ప్రశాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, చంద్రబాబు కూడబలుక్కొని గోదావరిని చెరబట్టి తెలంగాణను ఎండబెట్టే కుట్రలు చేస్తుంటే.. రేవంత్‌రెడ్డి చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారని విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు.
హైదరాబాద్ మే 22 (నమస్తేతెలంగాణ): రైతుల కడగండ్లు తీర్చేందుకు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం తెలంగాణకు జీవనాడి అని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు అభివర్ణించారు. దేశానికే తలమానికంగా నిలుస్తున్న ఈ బృహత్తర ప్రాజెక్టును చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై రాజకీయ కుట్రలకు దిగుతున్నదని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. లక్ష ఎకరాలకు నీరందించడంతోపాటు రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చిన ఎత్తిపోతల పథకాన్ని విఫల ప్రాజెక్టుగా చూపేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు ఈ ప్రాజెక్టులోని చిన్నచిన్న లోపాలను సరిదిద్ది వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ప్రజానీకం క్షమించబోదని హెచ్చరించారు.
అమరచింత, మే 22 : అభివృద్ధి ప్రదాత.. అపర భగీరథడు.. తెలంగాణ సాధకుడు కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం వనపర్తి జిల్లా అమరచింతలోని బీఆర్ఎస్ నేత రాజేందర్‌సింగ్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీపీఆర్ లేకుండా నారాయణపేట-కొడంగల్ పథకాన్ని ఆగమేఘాల మీద మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు సీఎం కుటుంబ సభ్యులతోపాటు కాంగ్రెస్ నాయకుల కమీషన్ల కోసమేనని విమర్శించారు.