పరిగి, ఏప్రిల్ 3: పేద రైతుల భూములు గుంజుకొని ప్రభుత్వం రాక్షసానందం పొందుతున్నదని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి సబితారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ అనేక చోట్ల భూములు గుంజుకుంటూ అన్నదాతల ఉసురు పోసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం వద్ద వేలాది ఎకరాల భూములున్నా మళ్లీ భూ సేకరణ చేయడం సరికాదని హితవుపలికారు. కాళ్లాపూర్, రాపోల్ రైతులు భూములు కోల్పోకుండా, వారి వెంట ఉండి బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. పరిగి మండలం కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో సర్కార్ నిర్మించే ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు కోల్పోతున్న రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో శుక్రవారం పరిగి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌తో కలిసి సబితారెడ్డి పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో రైతుల భూములను ప్రభుత్వం లాక్కొంటున్న విషయమై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని, రైతుల గోడు, మహిళల ఏడుపు చూస్తే తన గుండె తరుక్కుపోతున్నదని, ఈ అంశంపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలని నిర్ణయిస్తే అర్ధాంతరంగా సమావేశాలు వాయిదా వేశారని వాపోయారు. రైతుల భూములను గుంజుకుంటే ఎట్టి పరిస్థితిల్లోనూ ఉపేక్షించబోమని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అన్నదాతల కోసం పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ఈ నెల 7న హరీశ్‌రావు కాళ్లాపూర్, రాపోల్ గ్రామాలకు వస్తారని, ఆ తర్వాత కేటీఆర్ వస్తారని తెలిపారు. హైదరాబాద్ కోకాపేట్‌లోని గోశాల భూములు తీసుకొని, గోశాలకు ఎన్కేపల్లిలో భూములివ్వాలని ప్రభుత్వం నిర్ణయించి రైతులను విడదీసి విడతలవారీగా భూములు తీసుకున్నదని తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 25వేల ఎకరా ల భూమి ప్రభుత్వం చేతిలో ఉన్నదని, కంపెనీలు తీసుకురావాలంటే మహేశ్వరంలో 14 వేల ఎకరాల భూమి ఉన్నదని సబితారెడ్డి సూచించారు. వాటిని జూపార్క్, ప్లే గ్రౌండ్‌కు ఇస్తారట అని దుయ్యబట్టారు. రాష్ర్టానికి పెట్టుబడులు వస్తే ఇప్పుడున్న చందనవెల్లి, సీతారాంపురంలోని వెయ్యి ఎకరాలు, మోమిన్‌పేట్‌లో వెయ్యి ఎకరాలు, రాకంచర్లలో 200 ఎకరాలు, నంచర్లలోనూ భూములు ఉన్నాయ ని, ముందుగా అక్కడ కంపెనీలు ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు. ‘రైతులు తమ భూములను దున్ని సాగుకు సిద్ధం చేసుకోవాలి. పోలీసులు వస్తారా? కలెక్టర్ వస్తారా? స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఆపుతారా? చూద్దాం’ అని సూచించారు.
వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ఇప్పటికే 50 వేల ఎకరాల వర కు రైతులను భయపెట్టి గుంజుకున్నారని ఆరోపించారు. ‘మహేశ్‌రెడ్డి మీతో ఉంటారు. నాకు చిన్న మెసేజ్ పెడితే చాలు.. అర్ధరాత్రి అయినా పరుగెత్తుకొని వస్తా.. అసైన్డ్ భూములను పట్టా చేస్తామని ఎన్నికల్లో చెప్పిన రేవంత్‌రెడ్డి తన మాట నిలబెట్టుకోవాలి’ అని డిమాండ్ చేశారు. రెండున్నరేండ్లలో ఒక్క కంపెనీ అయి నా వచ్చిందా? అని ప్రశ్నించారు. కేవలం రైతుల భూములు గుంజుకొని దందా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతుల తరఫున పోరాటం చేస్తున్న కాళ్లాపూర్ సర్పంచ్ పుల్లయ్యను అభినందించారు. మహిళా రైతులు కన్నీరుపెట్టడంతో వారిని ఓదార్చారు.

సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టుగా భూమి చుట్టూ సీఎం రేవంత్‌రెడ్డి తిరుగుతున్నారని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు. లగచర్ల, హైడ్రా, మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, ఖమ్మంలో భూమి చుట్టే తిరుగుతున్నారని దుయ్యబట్టారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్‌రెడ్డిని ఉరికించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఓవైపు రెండు గ్రామాల ప్రజలు భూ ములు తీసుకోవద్దని ఆందోళన చేస్తుంటే దోమ మండలంలోనూ భూ సేకరణకు కొత్త నోటిఫికేషన్ వచ్చిందని, ఎమ్మెల్యే స్వగ్రామం శివారెడ్డిపల్లిలో సైతం భూ సేకరణ చేస్తారని ప్రచారమవుతున్నదని చెప్పారు.
అన్నదాతలు అధైర్యపడొద్దని, ఈ సమస్యలపై బీఆర్ఎస్ పోరాడుతుందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి భరోసా కల్పించారు. కాళ్లాపూర్, రాపోల్లో భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిందని తెలిసి రైతుల భూము లు లాక్కోవద్దని కలెక్టర్‌ను కలిసి రాతపూర్వకంగా ఇచ్చినా 11 రోజుల నుంచి ఎలాంటి స్పందనా లేదని తెలిపారు. మోమిన్‌పేట్ మం డలం ఎన్కతలలో వెయ్యి ఎకరాలను సేకరించి ఇప్పటివరకు అక్కడ కంపెనీలు ఏర్పా టు చేయలేదని తెలిపారు. 11రోజులుగా అన్నదాతలు రిలే దీక్ష చేస్తున్నా సర్కార్ పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతు లు పాదయాత్రగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తుంటే పోలీసులు అడ్డగించి, అరెస్ట్‌కు ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
తమ భూముల జోలికి వచ్చి తమను అన్యాయం చేయవద్దని వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని బట్లచందారం గ్రామానికి చెందిన బాధిత రైతులు నిమ్మలి తిరుపతయ్య, వార్ల అంజి, యువకులు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డిని కాళ్లాపూర్‌లో కలిశారు. లగచర్ల ఫార్మా కంపెనీకి తమ గ్రామ పట్టా భూముల్లో 235 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నట్టు తమకు నోటీసులు అందజేసినట్టు చెప్పారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ సబితారెడ్డికి వినతిపత్రం అందజేశారు.