కొడంగల్, మే 18 : రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోనే రైతులు పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు అరిగోస పడుతున్నారని విమర్శించారు. అసలు రాష్ట్రంలో సర్కార్ ఉన్నదా? అని ఆమె అనుమానం వ్యక్తంచేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు పక్షాన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయని, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దాదాపు రెండు నెలల కావస్తున్నా కొనుగోళ్లు చేపట్టడం లేదని మండిపడ్డారు. గన్నీ బ్యాగులు అందక అవస్థ పడుతున్నారని, వచ్చిన అరకొర బ్యాగులు కాంగ్రెస్ నాయకులు, మధ్యవర్తులకే పరిమితం కావడంతో సామాన్య రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు పక్షాన ధర్నా చేపట్టినప్పుడే రైతులకు గన్నీ బ్యాగులు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు ఏకంగా 13 కిలోల తరుగు తీస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గన్నీ బ్యాగు కావాలంటే రైతు రూ.50 చొప్పున డిపాజిట్ చేసే కొత్త పథకం కాంగ్రెస్ పాలనలో ఏర్పడిందని దుయ్యబట్టారు. పంట చేతికొచ్చి నెలన్నర దాటినా ధాన్యం కొనే దిక్కు లేదని మండిపడ్డారు. గన్నీ బ్యాగుల కొరత, రవాణా సౌకర్యాలు లేక రైతులు ధాన్యం కుప్పల వద్దే రైతులు పడిగాపులు కాస్తున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఏకకాలంలో రూ.30వేల కోట్లు రుణమాఫీ చేశారని, ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీకి రూ.40వేల కోట్లు కావాలని చెప్పి, కేవలం రూ.18 వేల కోట్లే మాఫీ చేశారని ధ్వజమెత్తారు. అప్పట్లో రూ.5లక్షల ప్రమాద బీమా వారం రోజుల్లో వచ్చేదని, నేడు సంవత్సరాలు గడుస్తున్నా బీమా ఊసే లేదని దుయ్యబట్టారు. సీఎం సొంత ప్రాంతంలోనే వేరుశనగ స్కామ్ జరిగితే ఇప్పటివరకు రేవంత్‌రెడ్డి స్పందిచడం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలు పట్టని సీఎం తమకెందుని ప్రజలు అంటున్నారని సబితారెడ్డి పేర్కొన్నారు.
రైతుల గోడు పట్టదా?
ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం సొంత నియోజకవర్గంలోనే రైతులు గోస పడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. సొంత నియోజకవర్గ ప్రజల కష్టాలనే పట్టించుకోని సీఎం రేవంత్‌రెడ్డి రాష్రానికి ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. ఈ సీఎం తమకొద్దని రైతులు, ప్రజలు బాహాటంగా చెప్పకోవడం చరిత్రలోనే మొదటి సారి అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎంకు రియల్ ఎస్టేట్, భూ కబ్జాలు వంటి వాటిపైనే మక్కువ ఎక్కువని ఆరోపించారు. లగచర్లలో రైతుల నుంచి భూములను లాక్కోని ఇప్పటివరకు అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద పటేల్, కౌన్సిలర్ వాణిశ్రీమధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.