బడంగ్‌పేట, సెప్టెంబర్ 1 : తెలంగాణ సాధించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషిచేసిన మాజీ సీఎం కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో సాగులో తెలంగాణను నంబర్‌వన్‌గా తీర్చిదిద్ది అపరభగీరథుడిగా పేరుగాంచిన కేసీఆర్ ఆనవాళ్లను తుడిపేసేందుకు రేవంత్ సర్కారు పూనుకున్నదని మండిపడ్డారు. అందులో భాగంగానే కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్పల్లిలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ..
కేసీఆర్‌పై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాకనే సీబీఐకి అప్పగించి చిల్లర రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణలో మేడిగడ్డను ఎండబెట్టి ఏపీలోని బనకచర్లకు నీటిని తరలించి తన గురువు చంద్రబాబు మెప్పు పొందేందుకు రేవంత్ పూనుకున్నట్టు స్పష్టమవుందని చెప్పారు. అన్నదాతలు నెల రోజులుగా యూరియా కోసం పడరాని పాట్లు పడుతుంటే, దీనిపై అసెంబ్లీలో ప్రస్తావించలేదని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, వారి నాటకాలకు త్వరలోనే తెరపడనున్నట్టు పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల దీవెనలు ఉంటాయని తెలిపారు.