Rythu Bharosa | హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): కొర్రీలు, కోతలతో రైతుభరోసా నిబంధనలు సిద్ధమవుతున్నాయి. పంటలకు పెట్టుబడి సాయం అందించే విషయంలో పలువర్గాలకు కోతలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లింపుదారులకు రైతుభరోసా ఇవ్వొద్దని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల పేర్లపై ఉండే భూమికి పెట్టుబడి సాయం ఇవ్వకూడదని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో రైతుభరోసాలో కోతలు ఖాయమనేది స్పష్టమైంది. కౌలురైతులకు కూ డా రైతుభరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నది.
నాడు అడ్డుకొని.. నేడు అభాండాలు
గత ఏడాది (2023) వానకాలం రైతుబంధును బీఆర్ఎస్ సర్కారు రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. నిజానికి, ఆ ఏడాది వానకాలానికి సం బంధించి అప్పటి ప్రభుత్వం 2023 ఆగస్టు 23 నాటికి 68.99 లక్షల మంది రైతుల ఖా తాల్లో రూ.7,624.74 కోట్లు జమ చేసింది.