BRS Silver Jubilee Meeting | (ఎల్కతుర్తి సభా ప్రాంగణం నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): వరంగల్‌లో ఒక్క తీరుగా ఉక్కపోత. ఇది చాలదన్నట్టు పాలకులు ఆంక్షల కర్రలు కాళ్లకు అడ్డం పెడుతున్నారు. ఇవేమి ప్రజలను ఆపలేకపోయాయి. పోలీసులు లారీలు అడ్డంపెట్టారు. అయినా యూత్, రైతు కదం తొక్కుకుంటా ఎల్కతుర్తి దారికి ఎగబడ్డారు. తూర్పు దికు కేయూ జంక్షన్ నుంచి హసన్‌పర్తి మీదుగా ఎలతుర్తి సభా వేదిక వరకు 12 కిలోమీటర్లు.. పశ్చిమ దిక్కు వంగర వయా ముల్కనూరు నుంచి ఎల్కతుర్తి వరకు దాదాపు 14.5 కిలోమీటర్లు , పడమరలో ధర్మసాగర్ నుంచి మడిపల్లి మీదుగా ఎలతుర్తి వేదిక వరకు 13 కిలోమీటర్ల మేర వాహన శ్రేణి నిలిచిపోయింది. సాయంత్రం ఆరు గంటల సమయానికి దాదాపు 5 లక్షల మంది సభా వేదిక చుట్టూ మూగారు. సరిగ్గా అదే సమయానికి కేసీఆర్ హెలికాప్టర్ గాల్లో ప్రజలకు కనిపించింది. అంతే జనం ఒక్క నిమిషం వృథా చేయలేదు.
ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వాహనాలను డ్రైవర్‌కు వదిలేసి పంట పొలాల మీదుగా నడుచుకుంటూ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. కేవలం గంట వ్యవధిలో మరో 5 లక్షల మంది పోగయ్యారు. మొత్తానికి 10 లక్షల మందికి పైగా సభికులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆ సమయంలో డ్రోన్ కెమెరా ద్వారా సభా వేదిక పరిసరాలను గమనిస్తే.. పుట్ట పగిలి చీమలు బారులు తీరినట్టు జనం సాగుతూ కనిపించారు. కేసీఆర్ ప్రసంగం మొదలయ్యే సమయానికి మసక చీకటి అయింది. ఆయన ప్రసంగం వినాలనే ఆకాంక్షతో జనం ఆత్రుతతో పరుగులు పెట్టిన సందర్భంలో పంట పొలాల్లో ఉన్న కంపదార చెట్లకు చర్మం గీరుకుపోయి రక్తాలు కారాయి. కొందరికి బట్టలు చిరిగాయి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల వేళ వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభా వేదిక పరిసర ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలు ఇవి.
అత్యధికులు 45 ఏండ్లలోపు వారే..
ఎండ తీవ్రత దృష్ట్యా వృద్ధులు, మహిళలను సభకు తీసుకురావద్దని స్వయంగా కేసీఆరే తమ పార్టీ నేతలకు సూచించినట్టు తెలిసింది. మహిళలు, వృద్ధులు వారి వారి గ్రామాల్లోనే ఉండి, టీవీల ద్వారా బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారం చూస్తూ.. ప్రసంగం వినే విధంగా సూచన చేయాలని పార్టీ నేతలకు సూచించినట్టు సమాచారం. దీంతో సభ వద్ద మహిళల సంఖ్య స్వల్పంగానే కనిపించింది. నిజానికి సభకు వస్తామన్న మహిళలను ప్రోత్సహించి ఉంటే ఎల్కతుర్తి సభా ప్రాంగణం ఏ మాత్రం సరిపోకపోయేదని నిర్వాహకులు అంటున్నారు. కానీ, పార్టీ నేతల అంచనాకు అందనంతగా తరలివచ్చిన యువత, రైతులు సభకు ఆకర్షణగా నిలిచారు. ఎల్కతుర్తికి తరలివచ్చిన జనసందోహంలో 70 శాతం మంది యువత 45 ఏండ్లలోపు వాళ్లే ఉండటం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఆనందంలో ముంచెత్తింది. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్. హైదరాబాద్ సాంకేతిక ఎడ్యుకేషన్ హబ్‌గా రూపాంతరం చెందింది.
పొరుగు రాష్ర్టాల నుంచి యువత ఉపాధి, ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ 16 నెలల కాలంలో సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతులు లేకపోవడంతో సాఫ్ట్వేర్ కంపెనీలు కాస్ట్ కటింగ్ అమలు చేస్తున్నాయి. లక్షల మంది ఉద్యోగాలు పోతున్నాయి’ అని హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ రవి ప్రతాప్ పేర్కొన్నారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను రోజుకు రూ.1,200 సంపాదించేవాడిని. డీజిల్ ఖర్చులు, ఆటో కిరాయి పోనూ రూ.600 మిగులుబాటు ఉండేది. కుటుంబ అవసరాలకు వెల్లుబాటు అయింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చినంక రోజుకు రూ.300 కూడాఎల్లుబాటు కావటం లేదు’ అని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండ లం బాలాజీ నగర్‌కు చెందిన ఆటో కార్మికుడు రమేష్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
అవును.. నిజమే…
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్ విరుచుకుపడినప్పుడు సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 16 నెలలుగా అస్తవ్యస్త విధానాలతో, అసమర్థ పాలనతో కాంగ్రెస్ తెచ్చిన కారుచీకట్ల నడుమ నలుగుతున్న ప్రజలకు కేసీఆర్ కొండంత ఆశాజ్యోతిగా కనిపించిండు. రైతుబంధు ఇవ్వడంలో, కరంటు, ఎరువులు, విత్తనాల సరఫరా, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందని కేసీఆర్ చెప్పినప్పుడు రైతులు ‘అవును’ అని ముక్తకంఠంతో ఒప్పుకొన్నారు. సరిగ్గా ఏడాదిన్నర కిందటి వరకు 24 గంటల కరంటు, సమయానికి రైతుబంధు, సరిపడా ఎరువులు, విత్తనాలతో గుండెల మీద చెయ్యి వేసుకొని తాము బతికిన రోజులను గుర్తుచేసుకున్నారు. ‘కల్లంకాడికే వచ్చి వడ్లు కొనుక్కపోయిన రోజులు పోయినయి’ అంటూ బాధపడ్డారు. చెప్పుడు మాటలు నమ్మి నిండా మునిగామంటూ ఆవేదన చెందారు. భూముల ధరలు ఎటుపోయినయని కేసీఆర్ ప్రశ్నించినప్పుడు రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లలో దుఃఖం పొంగుకొచ్చింది. అక్కర కోసం అమ్మబోతే సగం ధర పడిపోయిన పరిస్థితి గుర్తుకొచ్చి రైతులు, వ్యాపారం పడిపోయి, పెట్టుబడులు ఇరుక్కుపోయి ఏండ్ల కష్టం బూడిదపాలైందంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కండ్లల్లో నీళ్లు తిప్పుకున్నారు.
20-30 శాతం కమీషన్లు తీసుకునుడు, సంచులు నింపుడు, ఢిల్లీకి మోసుడులో ప్రభుత్వం పాస్ అయ్యిందని చెప్పగానే చోటా, బడా కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా తమ పరిస్థితి, బిల్లుల కోసం తాము పడ్డ నరక యాతనను, తిన్న లాఠీ దెబ్బలను, ఇచ్చిన కమీషన్లను గుర్తుతెచ్చుకున్నారు. ‘కేసీఆర్ కిట్, ఒమ్మ ఒడి వంటి పథకాలను లక్షాధికారుల కోసం పెట్టినమా?.. పేదల కో సం పెట్టినం.. మరి ఎందుకు నిలిపివేశారు’ అంటూ కేసీఆర్ నిలదీసినప్పుడు సభకు వచ్చిన ఆడబిడ్డలు ‘మా కోసం మా అన్న ప్రశ్నిస్తున్నడు’ అని ధైర్యం తెచ్చుకున్నరు. ‘కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇస్తున్నరా?’ అని అడిగినప్పుడు గతంలో ఠం ఛనుగా పడే లక్ష నూటాపదహార్లు కూడా ఇప్పు డు వస్తలేవని బాధపడ్డారు. ‘హెచ్‌సీయూ భూ ములను ఎట్లా అమ్ముతరు? విచక్షణ ఉం డొద్దా?’ అంటూ గర్జించినప్పుడు సభకు వచ్చి న యువతరం చప్పట్లతో, విజిళ్లతో హోరెత్తించింది. ఇవి మచ్చుతునకలు మాత్రమే. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట ప్రజల గుండెల్లోకి దూసుకుపోయింది. 2014 కు ముందు పరిస్థితులు, పదేండ్ల కేసీఆర్ పాలనలో అందివచ్చిన సౌకర్యాలు, 16 నెలల కాం గ్రెస్ పాలనలో అనుభవిస్తున్న కష్టాలు కండ్లముందు కదలాడాయి. అసమర్థ పాలన ఫలితంగా నలుగుతూ గుండెల నిండా భారంతో వచ్చిన లక్షలాది మందికి.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ ఇచ్చిన హామీతో ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది. ఆ సమయంలో లక్షలాది మంది ముఖాల్లో సంతోషం పొంగిపొర్లింది. ‘తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఒక ఎమోషన్’ అని మరోసారి రుజువైంది.
పడగొట్టాలే సారు..
కేసీఆర్ ప్రసంగం సభికులను ఆకట్టుకున్నది. కార్యకర్తల్లో జోష్ నింపింది. కేసీఆర్ ప్రసంగంతో సభికులు కనెక్ట్ అయ్యారు. ఈ సందర్భంలోనే కేసీఆర్ మాట్లాడుతూ.. ‘మా దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో ఈ ప్రభుత్వాన్ని ఇంకా మూడేండ్లు భరించాలని ఎవరో అంటే.. అదే మాటను ఆయన విలేకర్లకు చెప్పిండు. ఇగ చూస్సిర్రా మా గవర్నమెంట్‌ను పడగొడుతరంట అని అంటున్రు.. మేం ఎందుకు పడగొడుతాం రా భాయ్.. మాకేమన్న కాళ్లు చేతులు గులగుల పెట్టినయా.. మేం ఆ కిరికిరి పని చెయ్యం.. బిడ్డా మీరు ఉండాలే’ అని కేసీఆర్ చెప్పినప్పుడు.. వేదిక దగ్గర ఉన్న ముల్కనూరు గ్రామానికి చెందిన రైతు ఎల్లయ్య ‘కేసీఆర్ సారు… ఇంకా మూడున్నరేండ్లు సర్కారుంటే రైతులం బతుకం’ అనుకుంటా రెండు చేతులు ఎత్తి దండం పెట్టి అడగగా.. సభికులు ఆయనకు వంతపాడారు. రైతు వ్యాఖ్యలను పట్టుకున్న యువకులు ‘సీఎం.. సీఎం’ అంటూ నినదించటంతో కేసీఆర్ కొంత అసహనానికి గురయ్యారు. కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం ఇవ్వటంలో ఫెయిల్ అయిందని చెప్పారు.
ఆ తర్వాత ‘మంచినీళ్లు అందించటంలో’ అనగానే జనం ‘ఫెయిల్’ అంటూ ప్రతిస్పందించారు. కరెంటు సరఫరాలో అని కేసీఆర్ చెప్పగానే ‘ఫెయిల్’ అంటూ జనం ముక్తకంఠంతో అందుకున్నారు. దాన్యం కొనుగోళ్లలో..‘ఫెయిల్’ అంటూ ప్రతిస్పందించారు. ఈ సమయంలోనే దామెర గ్రామానికి చెందిన సంగమ్మ అనే మహిళ ‘తులం బంగారం ఇయ్యటంలో ఫెయిల్’ అనటంతో కేసీఆర్ ఆమె మాటను అందుకొని కల్యాణలక్ష్మి పథకం గురించి ప్రస్తావించారు. ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘మరి దేంట్లే పాస్ అయింది?’ అని కేసీఆర్ అడగగానే.. జనంలో నుంచి ఓ మహిళ ఆడోళ్లను జుట్లు జుట్లు పట్టించటంల పాసయ్యిందని గట్టిగా అనటంతో సభలో నవ్వులు విరిశాయి. కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే వ్యవసాయం బాగుపడుతుందని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇట్లనే కొనసాగితే రైతులు బతకరు.. అని ఎల్కతుర్తికి చెందిన రైతు చిన రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన మూడు ఎకరాల భూమిని సభ నిర్వహణకు ఇచ్చినట్టు చెప్పారు.