జగిత్యాల, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ కాలేదని ఇరువై రోజుల క్రితం రైతు ధర్నాలో ఆత్మహత్యాయత్నం చేసిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ రైతు తీవ్ర ఆవేదనతో మరోసారి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణ్రావుపేటకు చెందిన ఏనుగు సాగర్‌రెడ్డి(40)కి మూడెకరాలు ఉంది. భార్య మంజుల పేరున రెండెకరాలు ఉంది. సాగర్‌రెడ్డి భూషణ్‌రావుపేటలో ఉన్న సింగిల్ విండోలో 50వేలు, దక్కన్ గ్రామీణ బ్యాంకులో లక్ష రుణం తీసుకున్నాడు. మంజుల దక్కన్ గ్రామీణ బ్యాంకులో 1.60 లక్షల పంట రుణం తీసుకున్నది. సీఎం రేవంత్‌రెడ్డి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడంతో తన పేరిట ఉన్న 1.50 లక్షల రుణం, తన భార్య పేరిట ఉన్న 1.60 లక్షల రుణంలో కనీసం ఒకటి మాఫీ అవుతుందని భావించాడు. అనూహ్యంగా ఇద్దరికీ రుణమాఫీ కాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వ్యవసాయ అధికారులు, బ్యాంకు అధికారులను కలిసి విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం రాత్రి భూషణ్రావుపేటలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కథలాపూర్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో జగిత్యాల ప్రధాన దవాఖానకు తీసుకెళ్లారు.
రుణమాఫీ కోసం ఆగస్టు 20న కథలాపూర్‌లో రైతులు భారీ ధర్నాను చేపట్టారు. ధర్నాలో పాల్గొన్నప్పుడే సాగర్‌రెడ్డి పురుగుల మందు తాగే ప్రయత్నం చేశాడు. పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అన్ని మీడియాల్లోనూ సాగర్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం ప్రచురితమైంది. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సీఎం రేవంత్‌రెడ్డినే తన భర్త ఆత్మహత్యాయత్నానికి కారణమని భార్య మంజుల ఆరోపించింది. బుధవారం రాత్రి రైతు సాగర్‌రెడ్డిని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పరామర్శించారు.
భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని కామారెడ్డి జిల్లా పెద్దకొడప్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..ఇప్పటి వరకు వ్యవసాయాధికారులు పంటలను పరిశీలించలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కుటుంబాలు రోడ్డున పడుతాయని వాపోయారు. అనంతరం తహసీల్దార్ దశరథ్, మండల వ్యవసాయ అధికారి కిషన్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నా ముగిసిన తరువాత కొందరు రైతులు పెద్దకొడప్గల్ రైతువేదక వద్దకు వెళ్లగా తాళం వేసి ఉంది. ఉదయం 11.30 గంటలైనా ఒక్క అధికారి రాకపోవడంతో అన్నదాతలు అసహనం వ్యక్తంచేశారు. ఏవో కిషన్‌తో మాట్లాడి.. వచ్చేవరకు రైతువేదిక వద్ద పడిగాపులు కాశారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామ రైతులు తమ భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయొద్దని బుధవారం ఆందోళనకు దిగారు. ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్థూపం వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. మేడిపల్లిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తే మరో ఉద్యమానికి రైతులు సిద్ధం కానున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రైతులు గణేశ్, పాపిరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.