న్యాల్కల్, ఆగస్టు 1: బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీలో నష్టపోయిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ రైతు ఆవుటి అంజన్నకు న్యాయం చేస్తామని జిల్లా అధికారులు భరోసా ఇచ్చారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో నష్టపోతున్న రైతులు’ కథనానికి అధికారులు స్పందించారు.
కెనరా బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీ డబ్బులు వెనక్కిపోయి నష్టపోయిన రైతు ఆవుటి అంజన్నకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా హెల్ప్‌లైన్ అధికారి అరుణ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బ్యాంకు ద్వారా తీసుకున్న పంట రుణాన్ని తిరిగి చెల్లించి రెన్యూవల్ చేసుకున్నప్పటికీ బ్యాంకు అధికారుల తప్పిదంతో పాత బ్యాంకు లోన్ నంబర్‌ను పంపడంతో మాఫీ డబ్బులు వెనక్కి వెళ్లిపోయినట్టు రైతు తెలిపాడు. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లిందని, తప్పకుండా న్యాయం చేస్తామని జిల్లా అధికారి అరుణ బాధిత రైతుకు భరోసా చేప్పారు. తన గోడును జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ‘నమస్తే తెలంగాణ’కు రైతు కృతజ్ఞతలు తెలిపారు.