సిద్దిపేట, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లు నింపి, రైతులకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్‌తో రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో ఆదివారం రైతు మహాపాదయాత్ర చేపట్టనున్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్ వరకు రైతు మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు అన్నపూర్ణ రిజర్వాయర్ బండ్ (అల్లీపూర్) వద్ద నుంచి మహా పాదయాత్ర ప్రారంభం కానున్నది. ఈ 16 కిలోమీటర్ల మహాపాదయాత్రలో వేలాది మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొననుండగా, మాజీ మంత్రి హరీశ్‌రావు రైతులకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొననున్నారు.